English   

అనుకున్న‌దే.. సైరా షూటింగ్ మ‌ళ్లీ వాయిదా..!

sye raa narasimha reddy
2018-02-22 16:29:29

ఒక‌ప్పుడు చిరంజీవి సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయంటే ఆశ్చ‌ర్య‌పోయేవాళ్లు అభిమానులు.. కానీ ఇప్పుడు వాళ్ల‌కు కూడా ఇది అలవాటైపోయింది. దానికి త‌గ్గ‌ట్లే సైరా షూటింగ్ కూడా రోజురోజుకీ ఆల‌స్యం అవుతూనే ఉంది. చిరంజీవి వ‌య‌సు 63 ఏళ్లు కానీ ఇప్పుడు ఆయ‌న క‌ష్ట‌ప‌డుతున్న తీరు చూస్తుంటే ఎవ‌రికైనా అయ్యో అనిపించ‌క మాన‌దు. ఎందుకంటే త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు మెగాస్టార్. ఈ ఏజ్ లో కూడా సినిమా కోసం ఏమేం కావాలో అన్నీ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం బాడీ డ‌బుల్ కూడా అవ‌స‌రం లేదు.. అన్నీ తానే చేస్తాన‌ని ద‌ర్శ‌కుడికి చెప్పాడు చిరంజీవి. సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే సైరా తొలి షెడ్యూల్ అయిపోయింది. ప్ర‌స్తుతం సిజి వ‌ర్క్ న‌డుస్తుంది. 
తొలి షెడ్యూల్ లో చిరు త‌ప్ప ఎవ‌రూ రాలేదు. రెండో షెడ్యూల్ నుంచి స్టార్స్ సంద‌డి క‌నిపించ‌నుంది. న‌య‌న‌తారతో పాటు మిగిలిన చిత్ర‌యూనిట్ కూడా రెండో షెడ్యూల్ లో సైరా సెట్ లో అడుగుపెట్ట‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఈ షెడ్యూల్ మొద‌లు కావాల్సి ఉన్నా ఇప్పుడు మ‌రోసారి వాయిదా ప‌డింది. ముందు ఈ షెడ్యూల్ ను రాజ‌స్థాన్ లో ప్లాన్ చేసారు కానీ అక్క‌డ కొన్ని ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో కేర‌ళ‌కు షిఫ్ట్ చేసారు. త‌ర్వాత అది కూడా కుద‌ర‌క హైద‌రాబాద్ అనుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. మార్చ్ నుంచి ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ర‌త్న‌వేలు రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉండ‌టంతో.. సైరా షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది. ఆయ‌న అక్క‌డ చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉండ‌టంతో.. త‌న‌యుడి కోసం తండ్రి త‌న సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాడు.

రెండో షెడ్యూల్లోనే జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి సెట్ లో అడుగు పెట్ట‌నున్నారు. విజ‌య్ సేతుప‌తి ఇందులో ఉయ్యాల‌వాడుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఉండే ఓబ‌య్య పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. మూడో షెడ్యూల్ లో అమితాబ్ బ‌చ్చ‌న్ రానున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీల‌క‌మైన గోసై వెంక‌న్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్. మ‌నం త‌ర్వాత ఆయ‌న న‌టిస్తున్న తెలుగు సినిమా ఇదే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొంద‌నున్న ఈ చిత్ర విష‌యంలో ఎక్క‌డా కాంప్రమైజ్ కావ‌ట్లేదు మెగా వార‌సుడు. సురేంద‌ర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన త‌ర్వాత కానీ రంగంలోకి దిగ‌లేదు. 2019 స‌మ్మ‌ర్ కు సైరా విడుద‌ల కానుంది. 200 కోట్లు ఈ చిత్రానికి ప్రాథ‌మిక బ‌డ్జెట్ గా నిర్ణ‌యించారు. అది పెరిగినా ఆశ్చ‌ర్య పడాల్సిన ప‌నిలేదు.

More Related Stories