English   

తేజ్ ఐ ల‌వ్ యూ రివ్యూ

TEJ-I-LOVE-YOU-Review
2018-07-06 14:20:52

క‌రుణాక‌ర‌ణ్ అంటే తొలిప్రేమ.. తొలిప్రేమ అంటే క‌రుణాక‌ర‌ణ్.. ఈ ఒక్క సినిమాతో ఇన్నేళ్లు బ‌తికేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ సినిమా త‌ర్వాత రెండేరెండు హిట్లు కొట్టాడు కరుణాక‌ర‌ణ్. 20 ఏళ్ల‌లో మూడు హిట్లు కొట్టిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు తేజ్ ఐ ల‌వ్ యూ అంటూ వ‌చ్చాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? ఈ సారైనా ఈ ద‌ర్శ‌కుడు గాడిన ప‌డ్డాడా..?

క‌థ‌: తేజ్ (సాయిధ‌రంతేజ్) చిన్న‌పుడే ఓ చేయ‌ని త‌ప్పుకు ఏడేళ్లు జైలుకి వెళ్తాడు. ఆ త‌ర్వాత కుటుంబం అంతా అత‌న్ని ప్రాణంగా చూసుకుంటుంది. కానీ త‌న చెల్లి పెళ్లిని ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేకుండా చేసి కుటుంబానికి దూరం అవుతాడు తేజ్. హైదరాబాద్ లో మ్యూజిక్ ట్రూప్ న‌డుపుతుంటాడు.  ఆ టైమ్ లోనే నందిని(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) ను చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఆమెతోనే అనుకోకుండా ఓ చిన్న త‌ప్పు చేసి ఇరుక్కుపోతాడు. ఆ క్ర‌మంలోనే నందిని కూడా తేజ్ ను ల‌వ్ చేస్తుంది. ప్రేమ విష‌యం చెప్ప‌డానికి వ‌స్తున్న త‌న‌కు యాక్సిడెంట్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: క‌రుణాక‌ర‌ణ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ క్లారిటీ వ‌చ్చేసింది ప్రేక్ష‌కులకు. ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ అనే ఊరికే అన‌లేదుగా ఆయ‌న్ని. తొలిప్రేమ ఇచ్చిన మ‌త్తులోంచి ఇంకా బ‌య‌టికి రాలేక అక్క‌డే తిరుగుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. వాసు.. యువ‌కుడు.. డార్లింగ్.. ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇలా టైటిల్స్ మారుతున్నాయి కానీ క‌థ  మాత్రం అక్క‌డ‌క్క‌డే తిరుగుతుంది. ఇప్పుడు తేజ్ లో కూడా ఇదే జ‌రిగింది. ప్ర‌తీ సీన్ ఎక్క‌డో చూసిన‌ట్లుగానే అనిపించ‌డం ఈ చిత్రానికి అతిపెద్ద మైన‌స్. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే కూడా కొంప ముంచేసింది. తొలి సీన్ లోనే హీరోను ఫ్యామిలీ బ‌య‌టికి గెంటేయ‌డం.. ఆ త‌ర్వాత హీరోయిన్ తో ప్రేమ‌.. ఆమెకు ఓ ఫ్లాష్ బ్యాక్.. హీరోయిన్ క‌ష్టం తెలుసుకుని సాయం చేయాల‌నుకునే హీరో.. ఇవ‌న్నీ గ‌తంలో క‌రుణాక‌ర‌ణ్ సినిమాల్లోనే చూసాం. ముఖ్యంగా బాలు సినిమాలో ప‌వ‌న్, శ్రీ‌య మ‌ధ్య సీన్సే ఇక్క‌డ సాయి, అను మ‌ధ్య కూడా వ‌స్తాయి. ఓ త‌ప్పులో దొరికిపోయి హీరో హీరోయిన్ ను ఆడుకుంటుంది.. హీరోయిన్ హీరోను ఆడుకుంటుంది.. ఈ ఆట‌ల‌తోనే ఇంట‌ర్వెల్ కార్డ్ వ‌ర‌కు వెళ్తుంది. ఆ త‌ర్వాత కూడా క‌థ విలేజ్ కి షిఫ్ట్ అయినా క‌థ‌నం మాత్రం అక్క‌డే ఆగిపోతుంది. ఎంతకీ ముందుకు క‌ద‌ల్లేక ఉన్న‌చోటే నిలిచిపోతుంది. హీరోయిన్ ను ఇంప్రెస్ చేయ‌డానికి సాయి చేసే ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా మెప్పించ‌వు. హీరో కారెక్టర్ ను మ‌రింత ఎలివేట్ చేయ‌డానికి డార్లింగ్ లో చెల్లి పెళ్ళి సీన్ మాదిరే.. ఇక్క‌డా ఒక‌టి వాడేసాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ సీన్ వ‌ద్ద‌న్నా తొలిప్రేమ‌ను గుర్తు చేస్తుంది. 

న‌టీన‌టులు: సాయిధ‌రంతేజ్ తొలిసారి పూర్తి ల‌వ‌ర్ బాయ్ గా బాగా చేసాడు. కానీ క‌థ కొత్త‌గా లేన‌పుడు ఈయ‌న ఎంత చేసినా లాభం ఉండ‌దు. తేజ్ పాత్ర‌లో బానే మెప్పించాడు ఈ హీరో. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా నందినిగా ఇమిడిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్ గాళ్ గా క‌నిపించిన అను.. ఈ సారి మాత్రం కాస్త మాస్ ల‌క్ష‌ణాల‌తో న‌టించింది. హీరో పెద‌నాన్న‌గా జ‌య‌ప్ర‌కాశ్ బాగా చేసాడు. థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కామెడీ అక్క‌డ‌క్కడా పేలింది. హీరో ఫ్రెండ్స్ గా జోష్ ర‌వి, వైవాహ‌ర్ష బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం: భలేభ‌లే మ‌గాడివోయ్, నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చిన గోపీసుంద‌ర్ నుంచి రావాల్సిన ఔట్ పుట్ అయితే కాదు ఇది. అంద‌మైన చంద మామ పాట త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ క‌నీసం గుర్తు కూడా ఉండ‌వు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ ప‌నితీరు బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కేఎస్ రామారావు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడు చెప్పింది చేసాడు. ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌ణ్ మాత్రం మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. త‌న నుంచి ప్ర‌తీసారి తొలిప్రేమ లాంటి సినిమా ప్రేక్ష‌కులు ఆశిస్తున్నార‌ని అనుకుంటున్నాడేమో కానీ కాస్త ఆ ఊహ‌ల్లోంచి బ‌య‌టికి వ‌స్తే ఆయ‌న నుంచి కూడా మంచి సినిమాలు వ‌స్తాయ‌ని తెలుసుకుంటే బాగుండేది.

చివ‌ర‌గా: తేజ్ వి ల‌వ్ యూ.. కానీ సినిమాను మాత్రం కాదు..

రేటింగ్: 2.5/5

More Related Stories