English   

నువ్వు నేను సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా..

nuvvu nenu
2020-06-06 14:59:00

ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన నువ్వు నేను సినిమా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. చిత్రం సినిమాతో మంచి విజయం అందుకున్న ఉదయ్ కిరణ్, తేజ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది. అది తెలిస్తే ఉదయ్ కిరణ్ స్టార్ అవ్వడానికి ఏ హీరో హెల్ప్ చేశాడో కూడా అర్థమవుతుంది. చిత్రం సినిమా తర్వాత రీమాసేన్, తేజ బిజీ అయిపోయారు.. కానీ ఆ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ కు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. దాంతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ ఆఫీస్ లోనే రోజు వచ్చి కింద కూర్చునే వాడు ఉదయ్ కిరణ్. ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వాలంటూ ఆయనను అడిగేవాడు. మరోవైపు తేజ తాను పరిచయం చేసిన హీరో కాబట్టి తనకు తెలిసిన నిర్మాతలతో అతని గురించి చెప్పేవాడు. అదే సమయంలో నువ్వు నేను కథ రాసుకున్నాడు తేజ.

ఆ సినిమాను తమిళ హీరో మాధవన్ తో చేయాలని ఫిక్స్ అయిపోయాడు. చెన్నై వెళ్లి కథ కూడా చెప్పాడు. కానీ తను తెలుగు సినిమాలు చేయను అంటూ తేజకు చెప్పడంతో వేరే హీరోల కోసం కూడా ట్రై చేశాడు. అయినా కూడా నువ్వు నేను సినిమాకి హీరో ఎవరూ దొరకలేదు. అలాంటి సమయంలో నా సినిమాలో నువ్వే హీరో అంటూ ఉదయ్ కిరణ్ ను పెట్టేశాడు తేజ. అలా మాధవన్ వదులుకోవడంతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. ఆ రోజు మాధవన్ నువ్వు నేను సినిమా చేసుంటే ఈరోజు మనం చెప్పుకోవడానికి ఉదయ్ కిరణ్ అనే ఒక లవర్ బాయ్ ఉండేవాడు కాదేమో..? ఇక ఆ సినిమా తర్వాత మనసంతా నువ్వేతో మరో బ్లాక్బస్టర్ అందుకుని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు ఉదయ్. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఆయన జీవితంలో కొన్ని కుదుపుల కారణంగా కెరీర్లో పూర్తిగా వెనుకబడి పోయి 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. ఈ విషయాలన్నీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తేజ చెప్పడం విశేషం. 

More Related Stories