English   

అందాలరాముడు పుట్టిన రోజు

sunil
2018-02-28 16:36:29

స్వయంకృషితో టాప్ స్టార్ గా ఎదిగిన నటుడు సునిల్. కెరీర్ మొదలుపెట్టిన కొద్దికాలానికే కడుపుబ్బా నవ్వించి.. ఓ దశలో అలీ, బ్రహ్మీలకే గట్టి పోటీ ఇచ్చాడు. సునిల్ కు గుర్తింపు తెచ్చిన సినిమా నువ్వేకావాలి. నువ్వేకావాలికి ఉత్తమహాస్యనటుడుగా నంది అవార్డ్ కూడా రావడం విశేషం. మొదట్లో అతనికి బ్యాక్ బోన్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతను రైటర్ గా పనిచేసిన నువ్వేకావాలి సినిమాలో సునిల్ కు అదిరిపోయే పంచులు రాశాడు. అప్పటికి అవి సరికొత్తగా ఉండటంతో పాటు ఇతని టైమింగ్ తో తిరుగులేని గుర్తింపు తెచ్చాయి. ఆ గుర్తింపును తన ప్రతిభతో కంటిన్యూ చేసుకుని టాప్ కమెడియన్ గా ఎదిగిపోయాడు సునిల్. సునిల్ టైమింగే కాదు.. ఎంట్రీ ఇచ్చిన టైమ్ కూడా బావుంది. కొత్తశతాబ్ధి ఆరంభంలో సరికొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వస్తూ.. సంచలనాలు సృష్టిస్తోన్న సమయంలో వచ్చాడతను. నాచురల్ టాలెంట్ తో చాలా త్వరగానే మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుర్రాళ్ల చేత నువ్వు యూత్తేంట్రా.. అనిపించుకున్నా.. అప్పటి కొత్త కుర్రాళ్లకు కరెక్ట్ జోడీగా అదరగొట్టింది మాత్రం ఖచ్చితంగా సునిల్ మాత్రమే. ముఖ్యంగా నాటి యూత్ స్టార్స్  .. తరుణ్, ఉదయ్ కిరణ్ లకు సునిల్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే మనసంతా నువ్వే సినిమాలో ఎంత కామెడీ పండిస్తాడో ఓ స్నేహితుడిగా అంతే నిజాయితీగా కనిపిస్తాడు.. సముద్రంలో తన వాచ్ పడేసుకుని ఏడుస్తోన్న ఉదయ్ కిరణ్ తో సునిల్ చెప్పేడైలాగ్ లో అతనిలోని మంచి నటుడ్ని కూడా చూస్తాం.. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగుల ప్రభావం కూడా ఇండస్ట్రీపై చాలా తొందరగా బలమైన ముద్రవేసింది. దీంతో అప్పటి వరకూ పేజీల కొద్దీ డైలాగులున్న స్క్రిప్ట్ ల స్థానంలో సింగిల్ లైన్ లోనే పంచ్ లు రాయడం మొదలుపెట్టారు రైటర్స్. ఆ విషయంలో ముందు నుంచీ టాప్ రేంజ్ లో ఉన్న సునిల్ అందరికీ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయాడు. స్టార్ హీరోలతో పాటు స్మాల్ హీరోల సినిమాల్లోనూ అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు. సునిల్ కమెడియన్ గా ముద్రవేసుకున్నా.. స్వతహాగా మంచి నటుడు.. అందుకే నటనలో అంత ఈజ్ ఉంటుంది. తను చేస్తున్న పాత్రలకు సంబంధించి కొన్నిసార్లు ఓ రకమైన మ్యానరిజమ్స్ క్రియేట్ చేసుకుంటాడు. అవి అలా ముద్రపడిపోయతాయంతే.. అలా అతను చేసినవి చాలానే ఉన్నాయి. మొత్తంగా మారిన ట్రెండ్ కు అనుగుణంగా ఓ కమెడియన్ ఎన్ని రకాల పాత్రలు చేయగలడో అన్నీ అతి తక్కువ కాలంలోనే చేసేసి రికార్డ్ సృష్టించాడు సునిల్.. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో పాటు.. ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చిన్న హీరోలతోనూ అలరించాడు సునిల్. అయితే ప్రతిసారీ ఒకే ఎఫర్ట్ తో ఉంటాడు. అదే సునిల్ ఇండస్ట్రీలో అందరికీ ఆప్తుడ్ని చేసింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ వివాదాలు తెచ్చుకోలేదు సునిల్.. వివాదాలు వస్తాయనుకుంటే ఆ వైపూ వెళ్లలేదు. సొంత డిసిప్లిన్ తోనే ఇప్పుడీ స్థాయికి చేరుకున్నాడు అంటే కాదనేవారెవరుంటారు.. పెదబాబు సినిమాలో సునిల్ పంచిన నవ్వులకు ఫిల్మ్ ఫేర్ పురస్కారం ఇచ్చి మరీ ఇంక ఆపవయ్యా బాబూ అనేశారు.. 

కమెడియన్ గా వేగంగా దూసుకుపోతోన్న సునిల్ ను సడెన్ గా హీరోను చేశారు నిర్మాత ఆర్బీ చౌదరి. ముందు చాలామంది నమ్మలేదు. కానీ అందాలరాముడు టైటిల్ పెట్టేసరికి కొందరికి కోపం వచ్చింది. మా ఏఎన్నార్ టైటిల్ పెడతారా అన్నారు. అవేవీ పట్టించుకోకుండా చేసిన అందాలరాముడు అద్భుత విజయం సాధించింది. అన్నిటికీ మించి ఈ సినిమాలో సునిల్ స్టెప్పులకు తెలుగువారు నోరెళ్లబెట్టేశారు.. ఇతన్లో ఇంత గొప్ప డ్యాన్సర్ ఉన్నాడా అని. ఆ తర్వాత మళ్లీ హీరో జోలికి వెళ్లకుండా హీరోల పక్కనే కమెడియన్ గా కంటిన్యూ అయ్యాడు. అడపాదడపా ప్రధాన పాత్రలకు ఏ మాత్రం తగ్గని పాత్రలూ చేశాడు. కానీ ఎప్పుడైతే రాజమౌళి నుంచి పిలుపు వచ్చిందో అప్పుడే హీరోగా ఫిక్స్ అయిపోయాడు సునిల్. కల నెరవేరబోతోందన్న ఆనందంతో హార్డ్ వర్క్ చేశాడు. అసాధ్యం అనుకున్న తన బాడీ వెయిట్ తగ్గించి ఆశ్చర్యపరిచాడు. మర్యాదరామన్న బ్లాక్ బస్టర్ కావడంతో సునిల్ ఇంక కామెడీకి నీళ్లొదిలేశాడు. మొహమాటానికి కొన్ని చేసినా.. మనసంతా మర్యాదరామన్న తాలూకూ విజయమే ఉండటంతో సిక్స్ ప్యాక్ కూడా చేసి మరీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేశాడు. మర్యాద రామన్న, పూల రంగడు హిట్స్ .. దీంతో కొత్త జోష్ మొదలైంది. ఆ జోష్ లోనే స్టోరీ సెలెక్షన్ లో రాంగ్ స్క్రిప్ట్స్ వేయడమూ ప్రారంభమైంది. అందుకే మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, ఈడు గోల్డ్ ఎహే, జక్కన్న వంటి వరుస ఇబ్బందులు.. మధ్యలో నాగచైతన్యతో చేసిన మల్టీస్టారర్ తడాఖాలో నటనకు బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. 
 
సునిల్ బలం కామెడీ.. అతని ఇమేజ్ కూడా అదే.. కానీ హీరో కాగానే అతను దాన్ని పక్కనబెట్టాడు. తన పక్కన ఇంకొందరు కమెడియన్స్ ఉండేలా చూసుకున్నాడు. ఇదే అతని వైఫల్యాలకు కారణం అని చెప్పొచ్చు. కనీసం తనను తాను కామెడీ హీరోగా చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు సునిల్. అందుకే మళ్లీ కమెడియన్ గా మారాల్సిన పరిస్థితులు చాలా వేగంగా అతని వైపు వచ్చాయి.. 

ఇక హీరోగా అతను చేసిన గత రెండు సినిమాలూ దారుణ ఫలితాన్నిచ్చాయి. ఉంగరాల రాంబాబు, టూ కంట్రీస్..ఈరెండూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఈ రెండు సినిమాల తర్వాత వస్తాయనుకున్న మూవీస్ కూడా ఆగిపోయాయి. నిజానికి ఈ సినిమాలకు ముందే అతను మళ్లీ కమెడియన్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ప్రాబ్లమేం ఉండకపోవచ్చు. పైగా తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ఉన్నాడు కదా. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో సునిల్ మెయిన్ కమెడియన్ గా చేయబోతున్నాడు. మరి ఈ నవ్వుల ప్రస్థానం మళ్లీ మొదలుపెట్టబోతోన్న సునిల్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ అతని పంచుల కోసం వెయిట్ చేస్తూ మరోసారి ఈ భీమవరం బుల్లోడికి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం..

More Related Stories