English   

వాటే ఫోక్స్ ...?

Rangasthalam-flok-songs
2018-03-11 10:07:32

బీట్ వింటే చాలు.. హార్ట్ బీట్ పెరగాలి. ఆ డ్రమ్స్ సౌండ్ కు అడుగులు తెలియకుండానే ఆడాలి. ఇలా చేయాలంటే అది జానపదం అయి ఉండాలి. అది ఆ ఫోక్ సాంగ్స్ కు మాత్రమే ఉండే స్పెషాలిటీ. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఖచ్చితంగా ఓ ఫోక్ సాంగ్ ఉండేది. మధ్యలో మర్చిపోయారు. కానీ మళ్లీ మనకు ఆ జానపదాలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ రేంజ్ లో. ఇంకా చెప్పాలంటే ఆల్బమ్స్ లో అవే హైలెట్ అనేంతగా. యస్ గాజువాక పిల్లా, రానురానంటూనే వంటి నిన్నటి తరం తర్వాత ఇప్పుడు మళ్లీ అచ్చమైన జానపదాలు మన తెలుగు సినిమాల్లో సందడి చేస్తున్నాయి. నాని హీరోగా వస్తోన్న కృష్ణార్జున యుద్ధంలో దారి జూడు దుమ్మూ జూడూ మామ అంటూ సాగే పాట ఆ సినిమాకే హౌలెట్ అవుతుందని అర్థమైపోతుంది. అచ్చమైన పల్లె జానపదపు వాసన గుభాళిస్తోన్న ఈ పాటను ఒరిజినల్ ఫోక్ సింగర్ తోనే పాడించడం వల్ల ఆ పరిమళం మరింతగా విస్తరించింది. 

ఇక శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న నీదీనాదీ ఒకే కథ చిత్రంలోనూ మరో జానపదం అలరిస్తోంది. పార్వతి తనయుడవో అంటూ సాగే పాట మరో హైలెట్. ఈ పాటలో స్పెషాలిటీ ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని ఫోక్ స్టైల్ ను తీసుకుని మరీ ఒకే పాటలో వాడేశారు. అది కూడా అందంగా అమరిపోవడంతో పార్వతి తనయుడు మరిన్ని సొగసులు అల్లుకుని ఏకంగా శాస్త్రీయ సంగీతంతో ఎండ్ అయిపోతాడు. ఇప్పటి వరకూ వచ్చిన ఈ మూవీ పాటల్లో ఇదే హుషారైనది. రామ్ చరణ్ రంగస్థలంలో ఇప్పటి వరకూ విడుదలైన మూడు పాటల్లోనూ ఈ ఫోక్ గుభాళిస్తోంది. 

ఏరుశెనగకోసం నేలను తవ్వితే పాటైతే అచ్చంగా అలాగే వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా వచ్చిన రంగమ్మ మంగమ్మ పాట కూడా అదే. ఈ తరహా జానపదాలు ముఖ్యంగా మనకు విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వినిపిస్తాయి. ఓ జంట మధ్య తగువైతే ఆ విషయాన్ని చెప్పడానికి ఒక వస్తువునో లేక ఆశువుగా అనిపించే వ్యక్తి పేరుతోనో చెప్పుకుంటూ ఆ బాధను మర్చిపోతారు లేక ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే నితిన్ హీరోగా వస్తోన్న ఛల్ మోహన్ రంగా చిత్రంలోనూ నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి అంటూ సాగే పాట కూడా ఈ తరహాలో సాగేదే. ఇది తెలంగాణ బోనాల జాతరలో వినిపించే పాట. చాలా పాతదే. కానీ ప్రతి పండగకూ ఖచ్చితంగా వినిపిస్తుంది. అలాంటి పాట సినిమాలో ఉంటే ఆ కిరాక్ స్టెప్పులకు థియేటర్స్ ఊగిపోతాయని వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా ఈ మధ్య కాలంలో మన వెండితెర మళ్లీ జానపదాలతో అలరారుతోంది. మరో విశేషం ఏంటంటే.. ఈమధ్య వినిపిస్తోన్న ప్రతి పాటలోనూ సాహిత్యం స్పష్టంగా వినిపిస్తోంది. అంటే మన పాటకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే. ఏదేమైనా జానపదాల్లో సొగసు వెండితెరపై గుభాళిస్తే ఆ పరిమళం రేంజ్ వేరేగా ఉంటది.. అంతే. 

More Related Stories