English   

ముందుంది సినిమాల పండగ - జూలై డైరీ

tollywood
2018-07-02 09:43:41

గత శుక్రవారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రోజు తెలుగు నుంచి 9 సినిమాలు విడుదలయ్యాయి. అలాగే మరో ఒక హిందీ సినిమా, మరో ఇంగ్లీష్ సినిమా విడుదలయ్యాయి. అంటే ఒకే రోజు 11 సినిమాలు వచ్చాయన్నమాట. ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు ఒకే రోజు విడుదల కావడం రికార్డ్ అనే చెప్పాలి. అయితే వీటిలో ఏ ఒక్క తెలుగు సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆడుతుందనే నమ్మకమూ తెచ్చుకోలేదు. బాలీవుడ్ మూవీ సంజు మాత్రం బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. దీంతో ఇక ఈ ఫ్రైడే బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలన్నీ ఫ్రై అయిపోయినట్టే అనుకోవచ్చు. అయితే వచ్చే వారం నుంచి ఈ నెలంతా ఓ కొత్త సందడి మొదలు కాబోతోంది. ప్రతి వారం సరికొత్త చాలెంజెస్ తో సినిమాలు రాబోతున్నాయి. ఒక రకంగా దీన్ని జూలై డైరీ అనుకోవచ్చేమో.. ఈ మాన్ సూన్ లో మనల్ని పలకరించబోతోన్న ఫస్ట్ మూవీ గోపీచంద్ పంతం. ఈ నెల 5న విడుదల కాబోతోంది. మెహ్రీన్ కౌర హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి చక్రవర్తి దర్శకుడు. ఇతనికి ఇదే ఫస్ట్ మూవీ. గోపీచంద్ కెరీర్ లో ఇది 25వ సినిమా. సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పంతం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ తో గోపీచంద్ కు కెరీర్ కు కీలకమైన సినిమాగా జూలై 5న వస్తోంది పంతం. 

పంతం వచ్చిన నెక్ట్స్ డే నే సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐ లవ్యూ వస్తోంది. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరణ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. టాలీవుడ్ లో ప్రామినెంట్ ప్రొడక్షన్ హౌస్ గా చెప్పుకునే క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కెఎస్ రామారావు నిర్మించాడు. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజూకు ఈ సినిమా రిజల్ట్ కీలకం కానుంది. ఇక ఇదే రోజు నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన అఘోరా అనే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ గా పెద్దగా ఏ హడావిడీ లేదు కాబట్టి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
సో ఫస్ట్ వీక్ బెస్ట్ ఫైట్ చూసే ఆడియన్స్ కు ఆ తర్వాత కూడా ఓ మాంచి మసాలా ఫైట్ రెడీగా ఉంది. 

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న విజేత జూలై 12న విడుదలవుతోంది. రాకేశ్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా వారాహి బ్యానర్ లో తెరకెక్కింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇక కళ్యాణ్ కు కోలీవుడ్ నుంచి పోటీ ఉంది. తమిళ స్టార్ అయినా తెలుగువాళ్లూ ఓన్ చేసుకున్న కార్తీ నటించిన చినబాబు కూడా అదే రోజు విడదలవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రైతు కథాంశంతో వస్తోన్న సినిమా చినబాబు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకుడు. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే విజేతకు ఇబ్బందులు తప్పవు.
ఇక జూలై 12నే ఆర్ఎక్స్ 100 అనే సినిమా వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ డ్రా చేసిన సినిమా ఇది. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు దర్శకుడు. ఇక సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత రూపొందించిన ఆటగదరా శివ కూడా ఇదే రోజు వస్తోంది. కన్నడ టాప్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడలో సీనియర్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న దొడ్డన్న కూడా కీలక పాత్రలో నటించాడు. 

ఇక జూలై మూడో వారం కూడా మంచి పోటీ ఉంది. దిల్ రాజు నిర్మాణంలో అనీష్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన లవర్ జూలై 19న విడుదల కాబోతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా కాబట్టి ఈజీగా తీసిపారేయలేం. ఇక జూలై 20న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం విడుదల(డేట్ మారే అవకాశాలూ లేకపోలేదు) కానుంది. ప్రస్తుతం టాప్ హీరోలతో టాప్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. శ్రీవాస్ డైరెక్షన్ లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా చెబుతున్నారీ మూవీని. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ అండ్ ట్రైలర్ విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం హీరోగా నిలదొక్కునే ప్రయత్నాల్లో ఉన్న శ్రీనివాస్ కు ఈ సినిమా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. 

సాక్ష్యంతో పాటు పరచయం అనే మరో చిన్న సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది. ఇక నాలుగో వారానికి అంటే జూలై 27వరకూ మరికొన్ని సినిమాలు డేట్స్  అనౌన్స్ చేయొచ్చు. సో మొత్తంగా ఈ నెలంతా సినిమాల సందడి విపరీతంగా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకూ చెప్పుకున్న సినిమాల్లో కనీసం వారానికి ఒక్క సినిమా అయినా ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుందనే నమ్మకం అటు పరిశ్రమతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఉందనేది నిజం. సో ముందుంది మనకు సినిమాల పండగ.. 

More Related Stories