English   

అనసూయ థ్యాంక్‌ యు బ్రదర్‌ మూవీ రివ్యూ

Thank You Brother
2021-05-07 22:25:01

కరోనా కారణంగా థియేటర్‌లు మూతబడటంతో చాలా సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. అందులో భాగంగానే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో   ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘థ్యాంక్‌యు బ్రదర్‌’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ :  అభి (విరాజ్ అశ్విన్ ) బాధ్యతలేని గొప్పింటి కుర్రాడు. తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు.  ప్రియ(అనసూయ భరద్వాజ్‌) తన భర్త చనిపోయి, అతను పనిచేసే కంపెనీ నుంచి డబ్బులు తీసుకునేందుకు తిరుగుతూ ఉంటుంది.   ఎలాంటి సంబంధంలేని అభి, ప్రియ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుపోతారు. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రియకు నొప్పులు ప్రారంభమవుతాయి. అలాంటి సమయంలో అభి ఏం చేశాడు? లిఫ్ట్‌లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది ఆహాలో చూడాల్సిందే!

విశ్లేష‌ణ‌: నిండు గర్భిణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే, అదే సమయంలో ఆమెకు నొప్పులు మొదలైతే, ఇదే చిన్న ఎలిమెంట్‌ ను తీసుకుని కథగా మలుచుకున్నాడు దర్శకుడు రమేశ్‌. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ప్రథమార్ధమంతా అభి, ప్రియల నేపథ్యం చూపించేందుకు సమయం తీసుకున్నాడు. ఈ సన్నివేశాలు కాస్త విసుగు తెప్పిస్తాయి.

ఈ సినిమాకు ఉన్నంతలో ప్రధాన బలం సెకండాఫ్‌. ద్వితీయార్ధం అంతా లిఫ్ట్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో సాగుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి.  అభి, ప్రియల ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలను త్వరగా ముగించి, అసలు పాయింట్‌ అయిన లిఫ్ట్‌ సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో థ్రిల్లర్‌గా అలరించేది.

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్:  ఉన్నంతలో అనసూయ మంచి నటనతో ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేసింది. నిండు గర్భిణిగా ఆమె కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సహజమైన నటనతో తన పాత్ర మీద ఆపేక్ష కలిగేలా చేయగలిగింది. డబ్బు మదంతో గాడి తప్పిన కుర్రాడిగా విరాజ్ అశ్విన్ కూడా బాగానే చేశాడు.  హీరో స్నేహితులుగా వైవా హర్ష.. మరో కుర్రాడు ఓకే.మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

టెక్నిక‌ల్ టీం: కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి అరంగేట్రంలో ఓ భిన్నమైన కథను ఎంచుకోవడం అభినందనీయమే.కేవలం కథ కొత్తగా ఉంటే సరిపోదు.. అందులో కథనం.. సన్నివేశాలు కూడా భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గుణ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లిఫ్ట్ నేపథ్యంంలో వచ్చే సన్నివేశాల్లో ఛాయాగ్రాహకుడి కష్టం తెలుస్తుంది. 

చివరగా: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’...బోరింగ్ బ్రదర్ !!

రేటింగ్ : 2.25/5.

More Related Stories