English   

సినిమా థియేటర్స్ బంద్.. ప్రభావం

theaters
2018-03-01 16:37:40

ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా తెలుగు ప్రజలకు సినిమాకు మించిన వినోద సాధనం ఇంకా కనిపించలేదు. సినిమా మన జీవితాల్లో భాగం. అలాంటి సినిమాకు వెన్నెముఖ నిర్మాత. ఆ నిర్మాత ఇప్పుడు రోడ్డెక్కాడు. తనకు అన్యాయం జరిగిందని నినదిస్తున్నాడు. ఓ నిర్మాత సినిమా బాగాలేకపోవడం వల్లో, రిలీజ్ టైమ్ బ్యాడ్ అవడం వల్లో నష్టపోతే ఏమో అనుకోవచ్చు. కానీ తను తీసిన సినిమాను ప్రదర్శించే విషయంలోనే దగా పడుతున్నాడు. దీంతో పెద్ద నిర్మాతలు ఫర్వాలేదు  కానీ చిన్న నిర్మాతలు మరీ చితికిపోతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పెద్ద నిర్మాతలే రంగంలోకి దిగారు. థియేటర్స్ బంద్ అంటున్నారు.. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ గొడవ ఎప్పుడు ఎందుకు ఎలా మొదలైంది.. ?

ఇండియాలో సినిమా ప్రదర్శన ప్రొజెక్టర్ తో ఉంటుంది. అప్పుడు మనకు రీల్స్ ఉండేవి. థియేటర్స్ సంఖ్యను బట్టి ఆ రీల్ ను ఇన్ని వందల అడుగుల వరకూ ఎక్స్ పోజ్ చేయాలి అనే సంప్రదాయం ఉండేది.  పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆ స్థానంలో డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ప్రొజెక్టర్ లేకుండా సినిమా ప్రదర్శించడం ఈ విధానంలోని సౌలభ్యం. వాల్డ్ సినిమా ఎప్పుడో ఈ విధానంలోకి వచ్చింది. కానీ ఇండియాలో ఆలస్యంగా ఈ విధానంలోకి మారారు. ఈ టెక్నాలజీని ప్రపంచమంతా ఎప్పుడో అడాప్ట్ చేసుకుంది. దీని వల్ల నిర్మాతలకు చాలా డబ్బు ఆదా అవుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా థియేటర్స్ లో డిజిటల్ ఎక్విప్ మెంట్ సిద్ధం చేయించుకోవాలి. దీనిపై అవగాహన లేకపోవడం.. ఆల్రెడీ అలవాటైన ప్రొజెక్టర్ సిస్టప్ పూర్తి కమాండ్ ఉండటతో దక్షిణాది ఎగ్జిబిటర్స్ ఈ విధానంవైపు మొగ్గు చూడలేదు. ఈ నేపథ్యంలో తామే ఆ ఎక్విప్ మెంట్ ను అమర్చుతామని.. అందుకు అయిన ఖర్చును డిజిటల్ ప్రొవైడింగ్ ద్వారా ఐదేళ్లలో రికవర్ చేసుకుంటామని చెప్పారు. ఇన్ స్టంట్ గా డబ్బులు పెట్టకుండా కొత్త టెక్నాలజీ  వస్తోంది కదాని అన్ని థియేటర్స్ ఇందుకు అంగీకరించాయి. ఇదంతా దాదాపు పది పన్నెండేళ్ల క్రితం మాట. ఐదేళ్లు దాటిపోయాయి. వారి డబ్బులు వారికి రికవరీ అయినట్టే. కానీ ఆ విధానాన్ని సవరించడం లేదు. పైగా వారానికి ఇంత అంటూ వసూలు చేసే ఈ విధానంలో మొదట్లో వసూలు చేసినదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో థియేటర్స్ దొరికినా దొరక్కపోయినా వారానికి డబ్బు కట్టాల్సిందే. ఈ ఫీజ్ కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలుగులో అత్యధికం. దీన్ని వి.పి.ఎఫ్(విజువల్ ప్రింట్ ఫీజ్) అంటారు. అది నిర్మాతలకే కాదు.. బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ కూ భారమైపోతోంది. అందుకే ఈ విధానాన్ని సవరించాలని.. మరోసారి సమీక్షించి ఒప్పందాలకు అనుగుణంగా కొత్త మార్పులు తీసుకురావాలని నిర్మాతల మండలి చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ తెలుగులో డిజిటల్ సిస్టమ్ ను శాసిస్తోన్న యూఎఫ్ఓ, క్యూబ్ సంస్థలు వీరి మాట ఖాతరు చేయడం లేదు.. సరికదా ఇంకా రేట్లు పెంచారు. ఇది పుండుమీద కారం చల్లడం లాంటిది. పైగా చర్చల కోసం ఎన్నిసార్లు పిలిచినా కూడా లెక్క చేయడం లేదు. కనీసం వారి ప్రతినిధులను కూడా పంపించడం లేదు. ఈ మేరకు రెండు నెలల క్రితం దక్షిణభారత చిత్ర నిర్మాతల మండలి సమావేశమైంది. మార్చి 2నుంచి థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు చర్చలకు వచ్చి తమ డిమాండ్స్ కు ఒప్పుకుంటే థియేటర్స్ బంద్ ను విరమించుకుంటామని చెప్పింది. కానీ గత నెలలో బెంగళూరులో చివరి సమావేశానికి కూడా అటు యూఎఫ్ఓ, క్యూబ్ సంస్థలు రెండూ రాలేదు. దీంతో అనివార్యంగా థియేటర్స్ బంద్ కు దిగుతున్నారు. అయితే ఈ బంద్ లో మొదట రెండు తెలుగు రాష్ట్రాలు పాల్గొంటాయి. తర్వాత మిగతా మూడు దక్షిణాది రాష్ట్రాలు కలిసొస్తాయి.

అయితే ఈ విధానం వల్ల ఇప్పటి వరకూ మల్టీప్లెక్స్ లకు ఏ ఇబ్బందీ లేదు. అందుకే ఐమాక్స్, ఐనాక్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఈ బంద్ లో పాల్గొనడం లేదు. ఒక్కసారి పేమెంట్ చేస్తే వారం రోజుల వరకూ ఎన్ని షోస్ అయినా ప్రదర్శించుకునే వెసులుబాటు వారికి ఉండటమే ఇందుకు కారణం. కానీ భవిష్యత్ లో తమ నుంచి కూడా తెలుగు కంటెంట్ తీసుకుంటారు కాబట్టి.. మల్టీప్లెక్స్ లు కూడా బంద్ కు మద్ధతు తెలపాలని కోరింది నిర్మాతల మండలి. ఈ మేరకు వారితో చర్చలు సాగుతున్నాయి. 

వీరి డిమాండ్స్ ఏంటీ..? 

నిజానికి వీరు చేస్తోన్న డిమాండ్స్ కూడా కొత్తవి కావు. గతంలో చేసుకున్న ఒప్పందాల్నే మళ్లీ అమలు చేయాలంటున్నారు. వాటలో ముఖ్యంగా విపిఎఫ్(విజువల్ ప్రింట్ ఫీజ్) పూర్తిగా రద్దు చేయాలి.. లేదంటే కనీసం తగ్గించాలంటున్నారు. అలాగే సినిమా మధ్యలో వచ్చే అపరిమిత యాడ్స్ ను పరిమితం చేయాలంటున్నారు(దీనివల్ల ప్రేక్షకులకూ చిరాకు తప్పుతుంది). అలాగే అసలీ విధానం అమలులోకి వచ్చిన టైమ్ లోనే ప్రతి సినమా ప్రదర్శన మధ్యలో రెండు కొత్త సినిమా ట్రైలర్స్ (ఉచితంగా)ప్రదర్శించాలని. కానీ ఇప్పటి వరకూ ఈ ఒప్పందం అమలు కాలేదు. సో.. ఒక రకంగా ఇది సమీక్షే. లేదంటే చేసుకున్న ఒప్పందం ముగిసింది కాబట్టి పరిస్థితి యధావిధిగా కొనసాగేలా తీసుకోబోయే నిర్ణయం. కానీ ఈ మూడు విషయాల పట్ల యూ.ఎఫ్.ఓ, క్యూబ్ సంస్థలు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. 

బంద్ వల్ల ప్రభావం.. 

బంద్ వల్ల ప్రభావం ఉంటుందా..?అంటే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. సాధారణ పెట్టుబడితో వచ్చిన ఆ రెండు డిజిటల్ సంస్థలు ఇప్పుడు కోటానుకోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించాయి. ఓ నాల్రోజులు బంద్ జరిగినంత మాత్రాన వారికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే కొన్ని డిమాండ్స్ ను పరిశీలించే అవకాశం ఉంది( అదీ సౌత్ నుంచి ఇంకా పెద్దలెవరైనా రంగంలోకి దిగితే). కానీ ఇప్పటికే థియేటర్స్ లో ప్రదర్శితమవుతోన్న సినిమాలు, ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స చేసుకున్న సినిమాలు నష్టపోతాయి. ఎన్ని రోజులు బంద్ ఉంటుందనేది గ్యారెంటీ ఫిల్మ్ చాంబర్ కూ లేదు. పైగా ఈ నెలలో అన్నీ చిన్న సినిమాలే విడుదలకు ఉన్నాయి. అందుకే వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే సమస్య ఇండస్ట్రీకే కానీ డిజిటల్ ప్రొవైడర్స్ కు కాదు. లేదూ మొండిగా వెళితే.. నిజంగానే ఏదైనా శాశ్వత పరిష్కారమూ దొరికే అవకాశం ఉంది. కానీ అలా వెళతారా అనేది డౌటే. ఇండస్ట్రీలోనే ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన నిర్మాత ఇప్పటి వరకూ నిర్మాతల మండలికి, ఫిల్మ్ చాంబర్ కు వచ్చిన దాఖలాలు లేవు, కనీసం మద్ధతు కూడా తెలపలేదు. 

మొత్తంగా ఇన్నాళ్లూ జరుగుతుందా లేదా అనుకున్న బంద్ జరగబోతోంది. ఈ బంద్ కు సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అంచనా వేయలేం. ఎంత సినిమాయే ప్రధాన వినోదం అయినా.. అసలు థియేటర్సే తెరవకపోతే వారు మాత్రం ఏం చేస్తారు. ఇతర వినోదాల వైపు వెళతారు. ఇది కూడా పరిశ్రమకు ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రేక్షకులు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను సపోర్ట్ చేస్తారనుకోలేం. గతంలో ఇబ్బడిముబ్బడిగా టికెట్ రేట్లు పెంచినప్పుడు ఏ ఒక్కరూ ప్రేక్షకుడి తరఫు నుంచి మాట్లాడలేదు. అది కూడా వారికి సమస్యే. మరోవైపు .. ప్రస్తుతం కొంతమంది మాత్రమే హడావిడీ చేస్తున్నారు. అలా కాకుండా ప్రధాన నిర్మాణ సంస్థలు(పాతవారితో కలిపి) సమిస్టిగా ఈ సమస్యపై పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు.. 

కొసమెరుపేంటంటే... కొన్నాళ్ల క్రితం ఈ డిజిటిల్ సిస్టర్ ఎంటర్ అయ్యాక.. ఇబ్బందులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఓ తెలుగాయనే ఇంతకంటే చాలా తక్కువ విపిఎఫ్ కే నేను మీకు అవే సౌకర్యాలు ఇస్తానని ముందుకొచ్చాడు. కానీ అప్పుడు ఆయన్నెవరూ పట్టించుకోలేదు. సరికదా కమెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు చాలామంది ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారట..

More Related Stories