English   

టిక్ టిక్ టిక్ రివ్యూ

TIK-TIK-TIK-REVIEW
2018-06-23 08:30:03

హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ‌గా చూసే స్పేస్ థ్రిల్ల‌ర్స్ ఇప్పుడు ఇండియాకు కూడా వ‌చ్చేసాయి. ఎప్పుడో గ‌తేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న టిక్ టిక్ టిక్ ఎందుకో కానీ ఇన్నాళ్లూ వాయిదాలు ప‌డుతూ వ‌స్తుంది. ఇప్పుడు విడుద‌లైంది ఈ చిత్రం. మ‌రి ఇండియాస్ తొలి అంత‌రిక్ష చిత్రం ఎలా ఉంది..? అంచ‌నాలు అందుకుందా..? 

క‌థ‌: వాసు(జ‌యంర‌వి) ఓ దొంగ‌. ఓ కేస్ లో జైల్లో ఉంటాడు. అత‌న్ని క‌ల‌వ‌డానికి స్పేస్ ఆప‌రేష‌న్ ఆఫీస‌ర్లు వ‌స్తారు. అంత‌రిక్షంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల భూమిపైకి భారీ ఉల్క ఒక‌టి వ‌స్తుంద‌ని తెలుసుకుని.. 4 కోట్ల మంది ప్రాణాలు కాపాడ‌టానికి వాళ్లు వాసు సాయం కోసం వ‌స్తారు. అత‌న్ని వాడుకుని స్పేస్ లో మ‌రో దేశం దాచేసిన ఓ భారీ మిసైల్ ను దొంగ‌త‌నం చేయించాల‌నేది అంత‌రిక్ష అధికారుల ప్లాన్. దానికోసం వాసును అడుగుతారు. దానికి వాసు ఏమ‌న్నాడు..? అత‌డు అంత‌రిక్షంలోకి ఎలా వెళ్లాడు..? అస‌లు ఆ మిస్సైల్ ను తీసుకున్నారా లేదా అనేది అస‌లు క‌థ‌..!

క‌థ‌నం: టిక్ టిక్ టిక్.. కొన్ని రోజులుగా త‌మిళ్ తో పాటు తెలుగులోనూ బాగానే వినిపించిన పేరు ఇది. దానికి కార‌ణం ఈ చిత్రం ఇండియాలోనే తొలిసారి స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డం. అక్క‌డే క‌థ జ‌రుగుతుందంటే అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు. ఓ గ్రావిటీ.. ఓ స్పేస్ లాంటి సినిమాల‌ను మైండ్ లో పెట్టుకుని ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్స్ కు వెళ్తుంటారు. కానీ హాలీవుడ్ హాలీవుడ్డే.. మ‌న ఉడ్ మ‌న ఉడ్డే. ఇక్క‌డ స్పేస్ అనే క‌థ మాత్ర‌మే తీసుకుని మిగిలిన క‌థ‌ను పూర్తిగా మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా మార్చేసాడు ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్. లాజిక్స్ ను పూర్తిగా గాలికి వ‌దిలేసి క‌థ‌ను ముందుకు న‌డిపించేసాడు ద‌ర్శ‌కుడు. అదే ఇబ్బందిగా అనిపిస్తుంది. అస‌లేమాత్రం అనుభ‌వం లేని ముగ్గురు దొంగ‌ల‌ను న‌మ్మి ఆకాశంలోకి ఎలా తీసుకెళ్తారు.. అంత‌రిక్షంలో మిస్సైల్ ను ఎలా దొంగ‌త‌నం చేస్తారు.. ఇలాంటి లాజిక్స్ ఏవీ లేకుండా క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే మేకింగ్ లో అవ‌న్నీ క‌వ‌ర్ చేయొచ్చ‌నే న‌మ్మ‌కం ఆయ‌న‌లో ఉన్న‌ట్లుంది. అందుకే సినిమా అక్క‌డ‌క్క‌డా బాగానే అనిపించినా కానీ ఈ లాజిక్స్ మాత్రం సినిమాపై ఉన్న ఇంప్రెష‌న్ ను త‌గ్గించేస్తాయి. స్పేస్ అనే ప‌క్క‌న‌బెడితే మ‌నం చూస్తున్న‌ది రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా అనిపిస్తుంది. 

న‌టీన‌టులు: జ‌యంరవి ఈ క‌థ న‌మ్మ‌డం గొప్ప విష‌య‌మే. ద‌ర్శ‌కుడు చెప్పింది న‌మ్మి ముందుకు వెళ్లిపోయాడు హీరో. న‌టుడిగా జ‌యంర‌వికి పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే లాజిక్స్ విష‌యంలో కూడా కాస్త ద‌ర్శ‌కున్ని అడ‌గాల్సింది. నివేదా పేతురాజ్ కూడా బాగానే చేసింది. ఆమె న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ ఏం లేదు. అంతా ఒకే ఎక్స్ ప్రెష‌న్స్ తో లాగించేసింది. హీరో ఫ్రెండ్స్ ప‌ర్లేదు. ఇక స్పేస్ ఆర్మీ ఛీఫ్ గా జ‌య‌ప్ర‌కాశ్ కూడా బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా మ‌న‌కు తెలియ‌ని మొహాలే. క‌థ‌లో కూడా పెద్ద‌గా వాళ్ల‌కు ఇంపార్టెన్స్ ఉండ‌దు.

టెక్నిక‌ల్ టీం: డి ఇమాన్ సంగీతం ప‌ర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. ముఖ్యంగా స్పేస్ లో ఉన్న‌పుడు వ‌చ్చిన ఆర్ఆర్ బాగానే అనిపిస్తుంది. సినిమా టోగ్ర‌ఫీ ప‌ర్లేదు. వెంక‌టేశ్ త‌న ప‌ని బాగానే చేసాడు. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ స్పేస్ లో ఉండే రెండు మూడు సీన్స్ మాత్రం కాస్త ఓవ‌ర్ అనిపిస్తాయి. భూమి మాదిరి ఫైట్ చేయ‌డం అనేది వింత‌గా అనిపిస్తుంది. ఇక ద‌ర్శ‌కుడు శ‌క్తిసౌంద‌ర‌రాజ‌న్ కొత్త ప్ర‌యోగం చేసాడు. దానికి ఆయ‌న ప్ర‌శంస‌నీయుడు. కానీ స్పేస్ అనే మాట ప‌ట్టుకుని మిగిలిదంతా రొటీన్ సినిమా చేసాడు. అదే మైన‌స్ ఇక్క‌డ‌. త‌మిళ్ లో జ‌యంర‌వికి ఉన్న ఇమేజ్ తో వ‌ర్క‌వుట్ అవుతుందేమో కానీ తెలుగులో మాత్రం క‌ష్ట‌మే.

చివ‌ర‌గా: టిక్ టిక్ టిక్.. కొంచెం థ్రిల్.. కొంచెం డ‌ల్..!

రేటింగ్:2.5/5

More Related Stories