హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. మోస్ట్ ట్రెండింగ్ స్టార్ ఆఫ్ ఇండియా..

ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. అలా మారుమోగడం మొదలైన తర్వాత ప్రభాస్ చేసుకుంటున్న మూడో పుట్టిన రోజు ఇది. బాహుబలితో పరిచయాలే అయ్యాయి.. కానీ 2తో ఏకంగా మనోడు స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం 1700 కోట్లకు పైగా వసూలు చేయడంతో ప్రభాస్ నేషనల్ వైడ్ గా సూపర్ స్టార్ అయిపోయాడు. మొన్నొచ్చిన సాహో సినిమా కూడా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో సూపర్ హిట్ అయింది. అక్కడ ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో అతడి అభిమానులు కూడా ప్రభాస్ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే వారోత్సవాలు కూడా జరిపారు. గత వారం రోజులుగా ప్రభాస్ పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరీర్ ను ఒక్కసారి చూద్దాం..!
ఈయన 2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. కృష్ణంరాజు నట వారసుడిగా వచ్చిన ప్రభాస్.. వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంతో ప్రభాస్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. వర్షం తర్వాత కొన్ని ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. 2005లో రాజమౌళి తెరకెక్కించిన చత్రపతితో మరో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కు మాస్ హీరోగా గట్టి పునాది వేసింది. తర్వాత మళ్లీ సేమ్ ప్రాబ్లమ్. చక్రం, పౌర్ణమి, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టేసాయి. అప్పుడొచ్చింది డార్లింగ్. అది మంచి విజయం సాధించడం.. వెంటనే మిస్టర్ పర్ ఫెక్ట్ తో మరో విజయం అందుకోవడం.. ఆ వెంటనే కొరటాలతో చేసిన మిర్చి ప్రభాస్ మార్కెట్ ను అమాంతం పెంచేయడం అన్నీ జరిగిపోయాయి. అప్పుడే బాహుబలికి ముహూర్తం జరిగింది. 2013 నుంచి పూర్తిగా బాహుబలికే అంకితమయ్యాడు ప్రభాస్.
ఓ నటుడికి నాలుగేళ్లు అనేది చాలా కీలకం. కానీ పెళ్లిని కూడా పక్కనబెట్టి.. రాజమౌళిని నమ్మి నాలుగేళ్లు రాసిచ్చేసాడు ప్రభాస్. దాని ఫలితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. 2015లో వచ్చిన బాహుబలి తొలి భాగం రికార్డులు సృష్టించింది. 600 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాకు తెలుగు రేంజ్ ఏంటో చూపించింది. ఇక బాహుబలి 2 అయితే ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో హిట్. ఈ చిత్రం 230 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ప్రభాస్ రేంజ్ చూపించింది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్ర బడ్జెట్ కూడా 120 కోట్లపైనే. ఈ చిత్రంతో హిట్ కొట్టి బాలీవుడ్ లోనూ జెండా పాతేయాలని చూస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈయన కలలు నెరవేరాలని కోరుకుంటూ.. ప్రభాస్ కు మరోసారి హ్యాపీ బర్త్ డే చెబుతుంది సినిమాపాలిటిక్స్.కామ్.