English   

ట్రెండ్ మార్చిన కుర్ర హీరోలు

Tollywood Heroes
2020-04-01 12:32:27

యంగ్‌హీరోలు అనగానే లవ్‌ స్టోరీసే గుర్తోస్తాయి. లవ్వుపువ్వు అంటూ వెంటపడే అల్లరి అబ్బాయిల పాత్రలే చేస్తారని జనాల్లో ఓ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇప్పుడా ఆలోచనని మార్చేస్తున్నారు కొంతమంది కుర్ర హీరోలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఎక్కువగా హిట్స్‌ కొడుతోన్న హీరో నాని. కొంచెం లవ్, మరికొంచెం ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని అలరిస్తోన్న ఈ హీరో ఇప్పుడీ ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌లోకి వెళ్తున్నాడు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో నెగటివ్ షేడ్ చూపించడానికి రెడీ అయ్యాడు. 'వి' సినిమాలో విలనీ వేషాలు వేస్తున్నాడు నాని. మాస్ స్టోరీస్‌తో మెగాఫ్యాన్స్‌కి దగ్గరైన హీరో సాయితేజ్. పాటలు, ఫైట్లు ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు చేసే తేజ్ ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాడు. రెగ్యులర్ హీరోయిజానికి దూరంగా 'చిత్రలహరి' చేసిన తేజ్, తర్వాత 'ప్రతిరోజూపండగే' చేశాడు. ఇప్పుడు దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు.

యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీస్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, ఈ మధ్యనే ఈ లవ్‌ ట్రాకులకు బ్రేకులేశాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత ప్రేమకథలకి కామా పెట్టిన విజయ్, ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగాడు. బాక్సింగ్‌ ఛాంపియన్‌గా పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు.రెగ్యులర్ స్టోరీస్‌ అంటే జనాలే కాదు, హీరోలు కూడా దూరం జరుగుతున్నారు. సమ్‌థింగ్ స్పెషల్‌గా అనిపించే స్టోరీస్‌కే సైన్ చేస్తున్నారు. కొత్త కథలతో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఆలోచనలతోనే కొంతమంది రైతుల్లా నాగలిపడుతోంటే, మరికొంతమంది గజినీల్లా మారుతున్నారు.

ఎలాంటి పాత్రైనా సూపర్ అనిపించే హీరో శర్వానంద్. లవర్ బాయ్ క్యారెక్టర్స్ అయినా, హెవీ ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా సమన్యాయం చేసే శర్వానంద్ ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. నాగలిపట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకోవడానికి 'శ్రీకారం' చుట్టాడు. ఈ మూవీతో కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.మెగాఫ్యామిలీ హీరోలకు ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం మాస్ స్టోరీస్‌కి దూరంగా కొత్త కొత్త కథాంశాలు ఎంచుకుంటున్నాడు. మొదటి నుంచే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తోన్న వరుణ్, ఇప్పుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ డ్రామాలో నటిస్తున్నాడు.

కెరీర్ బిగినింగ్‌లో లవ్ స్టోరీస్, మాస్ కథల్లో నటించిన నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా వైవిధ్యమైన కథల్లోనే నటిస్తున్నాడు. 'సూర్య వర్సెస్‌ సూర్య' సినిమాలో సూర్యుడిని చూస్తే ప్రాణం పోయే పాత్ర పోషించిన నిఖిల్, ఇప్పుడు 'ఎయిటీన్ పేజెస్' సినిమాలో గజినీ తరహా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా.

More Related Stories