English   

పొరుగింటి పుల్లకూర ఎంతో రుచిరా అంటున్న మన హీరోలు..

 tollywood
2020-08-07 16:40:22

తెలుగులో అద్భుతమైన దర్శకులున్నారు. మన సినిమాలను బాలీవుడ్ తో సహా అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు రీమేక్ చేసుకుంటున్నాయి. ఇక్కడే ప్రతిభావంతమైన దర్శకులు చాలా మంది కనిపిస్తున్నారు. అయినా కూడా మన హీరోలు పరభాషా దర్శకుల వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్లు చెప్పే కథలకు మనవాళ్లు పడిపోతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు కూడా తమిళ దర్శకులు వైపు.. ఇతర భాషా దర్శకుల వైపు అడుగులు వేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈయనకు రెండు అవకాశాలు ఇచ్చాడు బాలయ్య. అందులో జై సింహ ఓకే అనిపించగా.. రూలర్ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా ఇప్పుడు ఈ తమిళ దర్శకుడికి మరో అవకాశం ఇస్తున్నాడు బాలయ్య. 

 జూనియర్ ఎన్టీఆర్ కూడా కేజిఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో తర్వాత సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా రామ్ చరణ్ కూడా తమిళ దర్శకుడి వైపు అడుగులు వేస్తున్నాడు. తెలుగులో చాలామంది ఈయనకు కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా తమిళనాట సంచలన విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ చరణ్ ను మెప్పించిందని ప్రచారం జరుగుతుంది. వీళ్లతో పాటు మరి కొందరు హీరోలు కూడా పొరుగింటి పుల్ల కూర కావాలి అంటున్నారు. అఖిల్ అక్కినేని ఆమధ్య తమిళ దర్శకుడు మిత్రన్ చెప్పిన కథ ఒకటి విని బాగుంది అని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇలా మొత్తానికి మన హీరోలు ఇతర భాషా దర్శకుల వైపు అడుగులు వేస్తున్నారు. 

More Related Stories