English   

కాంప్రమైజ్.. ఓటిటి వైపు వస్తున్న భారీ సినిమాలు..

 Tollywood
2020-08-15 14:38:23

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మరో మూడు నాలుగు నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేయడం అనేది కల లాగే కనిపిస్తుంది. కరోనా వైరస్ దెబ్బ స్పష్టంగా మరో మూడు నాలుగు నెలల వరకు దేశంలో ఉండటం ఖాయం. అందుకే ఇప్పట్లో సినిమాలు విడుదల చేయడం అనే మాట మర్చిపోవాలి నిర్మాతలు. అందుకే ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే చాలా సినిమాలు అలా విడుదలయ్యాయి కూడా. చిన్న సినిమాలకు దీనికి మించిన ప్లాట్ ఫామ్ మరొకటి దొరకడం లేదు. 

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీలో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత దొరకడం కూడా కష్టమే. ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. వాటన్నింటినీ కాదని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం ఎగ్జిబిటర్ లకు తలకు మించిన భారమే.. అయినా అది జరగని పని. ఒకవేళ జరిగినా థియేటర్లకు ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి వస్తారు అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. అందుకే మరో ఆలోచన లేకుండా చాలా మంది చిన్న నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి ముందుకు వస్తున్నారు. 

ఇప్పటికే ఈ పద్ధతిలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు కృష్ణ అండ్ హిస్ లీల కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పెద్ద సినిమాలను కూడా ఓటిటి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇన్ని రోజులు బెట్టు చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని నాని వి సినిమాను 33 కోట్లకు అమెజాన్ కు దిల్ రాజు బేరం పెట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతకే సో బెటరూ సినిమా కూడా ఓటిటిలో విడుదలవుతుందని తెలుస్తుంది. రవితేజ క్రాక్ తో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఓటిటి వైపు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కాంప్రమైజ్ అంటూ అన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయన్నమాట.

More Related Stories