English   

బంద్ కోసం గీత దాటని నిర్మాత

tollywood producers

అందరూ ఉన్నారు ఒక్కడు తప్ప.. అందరూ నినదిస్తున్నారు. ఒక్కడు తప్ప.. అన్ని వేళ్లూ ఒకవైపే వెళుతున్నాయి. ఆతని వేలు తప్ప. ఇంతకీ ఎవరీ ఒక్కడు అంటారా..? తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పేద్ద ఫ్యామిలీకి చెందిన నిర్మాత. ఈయన ఆ నలుగురిలో ఒకడు. పరిశ్రమకేం వచ్చినా నేనున్నానంటూ రకరకాల కలరింగ్స్ ఇవ్వడంలో అతను సాటి. అతను గీసిన ‘గీతా’ ఎవరూ దాటరు అంటారు. ఆయన వద్ద అన్ని ఆర్ట్స్ ఉంటాయంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి వస్తే కనీసం ఆయన గీత కూడా దాటడం లేదు. దీని వెనక ఎన్నో కథలూ, కథనాలూ వినిపిస్తున్నా.. అసలు విషయం అందరికీ తెలుసు. తెలుగు సినిమా పరిశ్రమ థియేటర్స్ బంద్ కు పిలుపు ఇచ్చిన దగ్గర్నుంచీ.. చిన్నాపెద్దా నిర్మాతలు చేస్తోన్న హడావిడీ అంతా ఇంతా కాదు. కానీ ఈ హడావిడీలో ఆయన లేడు. సరేలే మెల్లగా వస్తాడు అనుకున్నారు చాలామంది. కానీ తీరా బంద్ టైమ్ దగ్గర పడి ఏకంగా బందే జరిగినా ఆయన నోరు తెరవడం లేదు.

అయినా ఇంతమంది బంద్ లో ఉన్నారు కదా.. ఆ ఒక్కడు రాకపోతే వచ్చే నష్టం ఏముందీ అనుకోవచ్చు. కానీ అసలు విషయమేంటో తెలుసా.. ఈ నిర్మాతలంతా కలిసి చేస్తోన్న బందే ఆయన వల్ల. అసలీ బంద్ ఎందుకు జరుగుతోంది. డిజటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వసూలు చేస్తోన్న వర్చువల్ ప్రింట్ ఫీజ్ కు వ్యతిరేకంగానే కదా.. ఆ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ లో తెలుగు పరిశ్రమను శాసిస్తోంది క్యూబ్ సంస్థ. అంటే క్యూబ్ ఒక్కటి డిమాండ్స్ కు ఒప్పుకుంటే బంద్ ఆగుతుంది. కానీ అసలు విషయమేంటంటే.. ఈ క్యూబ్ సంస్థ ఉన్నదే మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటోన్న ఈ ఒక్కడి దగ్గర. యస్. అందుకే ఇంత పెద్ద బంద్ జరుగుతున్నా.. ఒక్క గీత కూడా ముందుకేయడం లేదు. ఇల్లంతా హీరోలను పెట్టుకుని, రెండు రాష్ట్రాల్లో గుప్పెట్లో ఉంచుకుని.. కూడా ఈ బడా నిర్మాత అసలు బంద్ బరిలోకే దిగలేదని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణం ఇదే.. అనేది ఓపెన్ సీక్రెట్.

అయితే ఇక్కడే మరో విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ నలుగురులో ఉన్న మరో పెద్ద ఫ్యామిలీ నిర్మాతకూ ఈయనకూ థియేటర్స్ విషయంలో చిన్న గొడవ జరుగుతోంది. అది కాస్తా ఈగో క్లాష్ గా మారింది. ఆ క్లాష్ నుంచి వచ్చిందే ఈ బంద్ అంటున్నారు చాలామంది. మరి ఆ నిర్మాతకూ ఈ ఒక్కడికి ఎక్కడ చెడిందో గానీ.. పాపం ఇప్పుడు వీరి వల్ల చాలామంది రోజువారీ ఉపాధి కోల్పోతున్నారు. నిజానికి సమస్య ఇక్కడి వరకూ రావడానికి కూడా ఈయన ఈగో గీత దాటకపోవడమే అంటున్నారు. అది దాటితే తన ఫ్యామిలీలో తమ్ముడు, తనయుడు హీరోలుగ ఉన్న ఆ నిర్మాత కూడా ఎప్పుడో ఈ గొడవను అర్థంతరంగా వదిలేసేవాడే అంటున్నారు.

కొసమెరుపేంటంటే.. బంద్ కు ముందు వరకూ హడావిడీ చేసిన ఈ నిర్మాత.. మొదటి రోజు బంద్ లో ఎక్కడా కనిపించలేదు. కొందరు మీడియా మిత్రులు ఆయనెక్కడ అనడిగితే.. తన స్టూడియోలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.. సాయంత్రం వస్తారు అన్నారట. సాయంత్రం కాస్తా తెల్లారడం ఖాయం. ఇంకా చెబితే తెల్లారితే ఆయన కనిపిస్తారా అనేదీ గ్యారెంటీ లేదు.. మొత్తంగా ఈగోస్ తో మొదలై ఇదో యుద్ధంలా మారినా ఆ ఒక్కడు మాత్రం తన గీత దాటడం లేదంటే ఆశ్చర్యమే.

More Related Stories