హ్యాపీ బర్త్ డే టూ త్రివిక్రమ్ శ్రీనివాస్..

అప్పటి వరకు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అనే పదం ఒక్క జంధ్యాలను అనేవారు. ఈ మాట వాడాలంటే చాలా శక్తి కావాలి. ఎవర్ని పడితే వారిని మాటల మాంత్రికుడు అనడం కష్టం. దానికి ఓ అర్హత ఉండాలి. అది చాలా త్వరగా.. చిన్న వయసులోనే సంపాదించుకున్నాడు త్రివిక్రమ్. ఎక్కడో భీమవరంలో లెక్చరర్ గా పనిచేసే ఓ కుర్రాడు.. తన స్వశక్తిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని.. స్టార్ రైటర్ స్థాయి నుంచి డైరెక్టర్ గా ఎదిగిన వైనం అద్వితీయం. రచయితగా ఉన్నపుడు కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకున్న ఏకైక రైటర్ త్రివిక్రమ్. ఈయన కథ రాసినా.. మాటలు రాసినా అవి తూటాలే. అందుకే హీరోలంతా ఈయనతో ఒక్కసారైనా పని చేయాలని ఆశ పడుతుంటారు. ఈయన పూర్తిపేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అయ్యాడు.
నవంబర్ 7న ఈయన పుట్టినరోజు. స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి రచయితగా పరిచయం అయ్యాడు త్రివిక్రమ్. దానికి ముందే పోసాని దగ్గర చాలా కాలం పాటు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేసాడు. స్వయంవరం సక్సెస్ తో త్రివిక్రమ్ కు గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, చిరునవ్వుతో, మన్మథుడు.. ప్రతీ సినిమాలోనూ మాటల తూటాలతో నవ్వులు పూయించాడు.. ఆలోచనలు తెప్పించాడు. నువ్వేనువ్వే సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే విజయం అందుకున్నాడు. అతడుతో ఆల్ టైమ్ క్లాసిక్ ఇచ్చాడు. జల్సాతో పవన్ ని ఫ్లాపుల పరంపర నుంచి బయటపడేసాడు. ఖలేజా దారితప్పినా.. జులాయి వేషాలతో బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు.
అత్తారింటికి దారేది సినిమాతో మంట గలిసిపోతున్న మానవ బంధాలకు మరో రూపం ఇచ్చాడు. అత్తంటే అమ్మతో సమానం అనే భావన తెచ్చాడు. సన్నాఫ్ సత్యమూర్తితో తండ్రి కంటే మన జీవితంలో మరో హీరో లేడనే సత్యాన్ని చూపించాడు. అ..ఆ.. ఆహ్లాదాన్ని చూపించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మరోసారి మాయ చేయబోయి అజ్ఞాతవాసితో డిజాస్టర్ ఇచ్చాడు ఈయన. అయితే వెంటనే అదే ఏడాది ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బన్నీతో అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఓవైపు రచయితగా.. మరోవైపు దర్శకుడిగానే కాదు.. వ్యక్తిగానూ త్రివిక్రమ్ ఉన్నతుడే. మొత్తా నికి భీమవరం టూ ఇండస్ట్రీకి ఓ వరంగా మారిపోయాడు ఈ మాటల మాంత్రికుడు. ఈయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిద్ధాం.