English   

TSRTC బస్సులో భీష్మ పైరసీ.. స్పందించిన కేటీఆర్..

Bheeshma
2020-02-28 17:08:45

ఈ రోజుల్లో విడుదలైన తర్వాత పైరసీని అదుపు చేయడం ఎవరి తరం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కలుగులోకి ఎలకలు దూరినట్లు ఎలాగోలా పైరసీ సీడీలు చేసి బయటికి వదిలేస్తున్నారు. విడుదలైన మధ్యాహ్నానికే ఆన్ లైన్ లో పైరసీ వచ్చేస్తుంది. ఎంతగా సైబర్ డిపార్ట్ మెంట్ పని చేసినా కూడా ఫలితం మాత్రం శూన్యమే. ఇక ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ ఆర్టీసి బస్సులో భీష్మ సినిమా పైరసీ వేసారు. ఇదే విషయాన్ని దర్శకుడు వెంకీ కుడుముల కూడా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. దానికి ఆయన కూడా స్పందించాడు. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన 'భీష్మ' బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. వారం రోజుల్లోనే ఈ చిత్రం 30 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 

ఇప్పుడు ఈ చిత్రం పైరసీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలిపాడు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్రదర్శించారు.. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీళ్లపై యాక్షన్ తీసుకోండి అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనిపై వెంటనే దర్శకుడు వెంకీ కుడుముల కూడా స్పందించాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. 

ఓ వైపు తన చిత్రయూనిట్ పైరసీలు అవ్వకుండా అన్ని రకాలుగా ఆపుతుంటే.. బస్సుల్లో పైరసీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు.. మీరు వెంటనే వాళ్లను ప్రశ్నించండి.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి... సినిమాలు తీయడానికి మేమెంతో డబ్బు పెట్టి కష్టపడుతుంటాం సర్.. మాకు ఏ బాధ వచ్చినా మీరే గుర్తుకొస్తారు సర్ అంటూ ట్వీట్ చేసాడు వెంకీ కుడుముల. కేటీఆర్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. నేను ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాను.. పైరసీని పూర్తిగా అంతం చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను అంటూ దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చాడు. గతంలో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా సీడీలు కూడా రోడ్డు పక్కన అమ్మేసారు.

More Related Stories