వక్కంతం పాచిక పారుతుందా..?

పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. ఎట్టకేలకు దర్శకుడిగా మారాడు వక్కంతం వంశీ. రచయితగా చాలా సినిమాలకు సక్సెస్ ఫుల్ కథలు అందించిన వంశీ.. దర్శకుడిగా మాత్రం బొక్కబోర్లా పడ్డాడు. సిన్సియర్ అటెంప్ట్ అంటూ బన్నీకి దారుణమైన డిజాస్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. నా పేరు సూర్యతో వక్కంతం కలలన్నీ ఆవిరైపోయాయి. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో రెండు నెలలుగా ఎవరికీ కనిపించడం లేదు వంశీ. రెండో సినిమా కోసం కనీసం ఏ హీరోకు కథ చెప్పాలో కూడా తెలియని కన్ప్యూజన్ లో ఉన్నాడు వక్కంతం.
రైటర్ గా ఓకే కానీ దర్శకుడిగా ఈయన పనికిరాడని నా పేరు సూర్య చూసిన తర్వాత చాలా మంది విమర్శల వర్షం కురిపించారు వంశీపై. అంతేకాదు.. చిన్న బడ్జెట్ సినిమా చేయకుండా ఏకంగా స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేసి ఆ నష్టాలకు బాధ్యుడయ్యాడంటూ బాగానే ఆడిపోసుకున్నారు ఈ దర్శకున్ని. దాంతో రెండో అవకాశం కోసం వంశీ చాలానే కష్టపడుతున్నాడు ఇప్పుడు. ఈయన రవితేజ కోసం కథ రాసాడని.. ఇప్పటికే మాస్ రాజా ఆమోదం కోసం వేచి చూస్తున్నాడని తెలుస్తుంది. గతంలో కిక్.. కిక్ 2.. టచ్ చేసి చూడు సినిమాలకు కథలు అందించాడు వంశీ. మరి ఇప్పుడు దర్శకుడిగా ఈయన మెప్పు పొందుతాడో లేదో చూడాలిక..