English   

వర్మ  ‘డి కంపెనీ’తో పెట్టుకుంటున్నాడు

ram gopal varma
2018-07-27 10:10:17

అండర్ వరల్డ్, మాఫియా నేపథ్యంలో సినిమాలకు ఇండియాలో ఊపు తెచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అత్యంత రియలిస్టిక్ స్టోరీతో ఒకప్పుడు ఎంటైర్ ఇండియానే ఊపేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఆఫీసర్ వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలతో ఆడియన్స్ ను బోర్ కొట్టిస్తున్నాడు. దీంతో తను మళ్లీ తన పాత కథల్లోకే వెళ్లబోతున్నాడు. అయితే ఈ సారి సినిమా కాదు. వెబ్ సిరీస్. అఫ్ కోర్స్ ఇలాంటి వెబ్ సిరీస్ లు ఇప్పటికే చాలా అనౌన్స్ చేసి ఉన్నాడు వర్మ. ఇదీ అందులో ఒకటి అనుకోవడానికీ ఆస్కారం ఉంది. కానీ ఈ సిరీస్ నిజంగానే వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే ఈ సారి మనోడికి మంచి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ కథ ఏంటంటే.. 1980ల్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఉంటుందట. 

అందుకే ఈ సిరీస్ కు ‘డి కంపెనీ’ అనే పేరు పెట్టాడు వర్మ. ఈ సిరీస్ లో దావూద్ కు సంబంధించిన ప్రస్తానం అంతా ఉంటుందట. అతను డాన్ గా మారడానికి కారణాలు, డాన్ అయిన తర్వాత చేసిన సంఘటనలు, తర్వాత దుబాయ్ పారిపోయిన విధానం అన్నీ చూపిస్తా అంటున్నాడు. అలాగే దావూద్ రైట్ హ్యాండ్ చోటారాజన్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. 1992-93లో ముంబైలో వరుస బాంబ్ బ్లాస్ట్స్ తర్వాత చోటారాజన్.. దావూద్ పై యుద్ధం ప్రకటించడానికి కారణాలు కూడా చూపిస్తా అంటున్నాడు. అయితే డి కంపెనీ మాఫియా కంపెనీగా మొదలై ఎలా టెర్రర్ కంపెనీగా ఎదిగిందనే క్రమం ఉంటుందనేది వర్మ కోణంలో చెబుతోన్న మాట. 

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం తను చాలా రీసెర్చ్ చేస్తున్నానని చెబుతున్నాడు. ఇప్పటికే తన వద్ద సేకరించిన సమాచారం చాలా ఉందని.. దీనికి ఇంకాస్త సమగ్ర సమాచారాన్ని కూడా జోడిస్తున్నానని చెబుతున్నాడు. మరి ఈ వెబ్ సిరీస్ నిజంగానే రూపొందుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories