English   

వెంకీ మామ మూవీ రివ్యూ

Venky Mama Review
2019-12-13 21:22:23

వెంకటేష్, నాగచైతన్య లాంటి నిజమైన మామా అల్లుళ్లు కలిసి నటించిన సినిమా కావడంతో ముందు నుంచి కూడా వెంకీ మామపై కాస్త మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటం.. జై లవకుశ తర్వాత బాబీ తెరకెక్కించిన సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి నిజంగానే వెంకీ మామ అంచనాలు అందుకున్నాడా..?

కథ:

వెంకటరత్నం (వెంకటేష్) ఓ రైస్ మిల్ ఓనర్. జాతకం అంటే వెంకటరత్నం తండ్రి (నాజర్)కు పిచ్చి. ఆ జాతకం ప్రకారమే పెళ్ళైన ఏడాది లోపే వెంకటరత్నం అక్క బావలు యాక్సిడెంట్‌లో చనిపోతారు. వాళ్లకు ఏడాది వయసు కూడా లేని కొడుకు ఉంటాడు. వాళ్లు చనిపోయిన తర్వాత వెంకటరత్నం తండ్రి ఆ కుర్రాన్ని దూరం పెడతాడు. దాంతో మేనల్లుడు కార్తిక్ (నాగ చైతన్య)ను ప్రాణంగా చేరదీసి పెంచుకుంటాడు మేనమామ. కార్తిక్ కోసం అన్నీ త్యాగం చేస్తాడు.. చివరికి తన జీవితం కూడా. అయితే జాతకం ప్రకారం కృష్ణుడి అంశలో పుట్టడంతో అల్లుడు నుంచే తన కొడుకుకు ప్రమాదం ఉందని తెలిసి కార్తిక్‌ను దూరం చేయాలని ప్రయత్నిస్తాడు వెంకటరత్నం తండ్రి. కానీ అది కుదరదు. అలాంటి సమయంలోనే తన జాతకం గురించి ఓ కఠినమైన నిజం తెలుసుకుంటాడు కార్తిక్. దాంతో మామయ్యను వదిలేసి ఆర్మీలో చేరిపోతాడు. అయితే చెప్పకుండా వెళ్లిపోవడంతో అల్లుడు గురించి వెతుక్కుంటూ మామ కూడా వెళ్తాడు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.. వీళ్ల జీవితంలోకి వెన్నెల ఎందుకొచ్చింది అనేది అసలు కథ..

కథనం:

అన్నిసార్లు కొత్త కథ చెప్పడం సాధ్యం కాదు..  కొన్నిసార్లు ఉన్న కథను కొత్తగా చెప్పడమే..  దర్శకుడు బాబీ కూడా వెంకీ మామతో ఇదే చేశాడు.. ఇప్పటికే మనం ఎన్నో సార్లు చూసిన కథ.. ఎంతో పండిన ఎమోషన్..  దాన్ని మళ్ళీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు బాబీ..  దానికి వెంకటేష్, నాగచైతన్య లాంటి నిజమైన మామ అల్లుడు దొరకడంతో చూస్తున్నప్పుడు మనకు కూడా ఎమోషన్ ఈజీగా కనెక్ట్ అవుతుంది..  చాలావరకు వెంకీమామలో ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి..  వాటిని మాస్ యాంగిల్‌లో కవర్ చేసే ప్రయత్నం చేశాడు బాబీ..  రొటీన్ కథ కావడంతో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఎమోషన్ వర్కవుట్ అవ్వడం వెంకీ మామకు కాస్త మైనస్..  ఫస్టాఫ్ వరకు మామ అల్లుళ్ళ అల్లరిని బాగా హైలైట్ చేశాడు దర్శకుడు బాబీ..  ఇటు వెంకటేష్ లవ్ స్టోరీ.. అటు నాగ చైతన్య ప్రేమ కథను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసాడు బాబీ. ఫస్టాఫ్‌లో కాస్త డబుల్ మీనింగ్ డోస్ కూడా ఎక్కువగానే కనిపించింది..  అదే నవ్వులు పూయించింది కూడా.. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.. దాన్ని జాతకంతో ముడిపెట్టాడు దర్శకుడు..

మేనల్లుడిని వెతుక్కుంటూ వెంకటేష్‌ ఆర్మీకి రావడం.. అక్కడ చైతూ సీక్రేట్ ఆపరేషన్ ఆసక్తి పుట్టించాయి.. సెకండాఫ్‌ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు పర్లేదు.. నాగ చైతన్య కూడా సైనికుడి పాత్రలో బాగానే కనిపించాడు. కానీ ఆ సీన్స్‌లో ఇంకాస్త ఇంపాక్ట్ ఉండే బాగుండేదేమో అనిపించింది..  

ఓ వైపు జాతకం.. మరోవైపు ప్రేమను సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో బాబీ ఎక్కడో తడబడినట్లు అనిపించింది.. రెండింటి మధ్య కథ రాసుకున్నా కూడా.. కథనంలో అక్కడక్కడా తేడా కొట్టేసింది.. జాతకం కరెక్ట్ అని చూపిస్తూనే.. ప్రేమ గెలుస్తుంది అంటూ ముగించాడు బాబీ. క్లైమాక్స్ ఎందుకో ఈజీగా తేల్చేసినట్లు అనిపించింది.. వెంకటేష్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు.. నాగ చైతన్య కూడా అదరగొట్టాడు.. మామా అల్లుళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్.. వాళ్ల కోసమే ఓ సారి చూడొచ్చు.. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోతకు సరిపోయారు.. ఓవరాల్‌గా వెంకీ మామ.. జస్ట్ టైమ్ పాస్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.

నటీనటులు:

మిలటరీ నాయుడు ఉరఫ్ వెంకటరత్నం పాత్రలో వెంకటేష్ అదరగొట్టాడు. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈజ్ చూపించాడు సీనియర్ హీరో. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసాడు. నాగ చైతన్య కూడా బాగా చేసాడు. మామ అల్లుళ్ల క్రేజీ కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్. ఆర్మీ సీన్స్ బాగా చేసాడు చైతూ. రాశీ ఖన్నా, పాయల్ గ్లామర్ డోస్ బాగానే పెంచేసారు. ఇద్దరూ పర్లేదు అనిపించారు. రావు రమేష్ విలనీ సగంలోనే ఆపేసాడు దర్శకుడు. ముగింపు ఇవ్వలేదు. ఆయన మరోసారి ఆకట్టుకున్నాడు. దాసరి అరుణ్ కుమార్, నాజర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి వాళ్లు పర్లేదు.

టెక్నికల్ టీం:

థమన్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. వెంకీ మామ టైటిల్ సాంగ్‌తో పాటు కొకోకోలా పెప్సీ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలను కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. బాబీ మరోసారి పూర్తిగా ఫార్మాట్ కథతో వచ్చాడు. అదే మైనస్.. అయితే తెలిసిన కథనే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని చూసాడు. కొంతవరకు సక్సెస్ అయినా కూడా కేవలం అభిమానుల కోసమే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. పూర్తిస్థాయి ఎమోషనల్ డ్రామా మాత్రం కనిపించలేదు.

చివరగా: వెంకీ మామ.. జాతకం ప్రేమ మధ్యలో పడి నలిగిన ఎమోషనల్ డ్రామా..

రేటింగ్: 3 /5.

More Related Stories