English   

మ‌హాన‌టిలో ఆ మ‌హానుభావులు..!

Mahanati-release
2018-05-08 16:37:02

ఒక్క సినిమాలో ఎంత‌మంది స్టార్స్ ను చూడ‌గ‌లం..? ఎంత బ‌యోపిక్ అయినా కూడా అంద‌ర్నీ ఒకే సినిమాలో చూడటం మాత్రం క‌ష్ట‌మే క‌దా..! కానీ ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టిలో తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌లంద‌రినీ ఒకే ఫ్రేమ్ లో చూపిస్తున్నాడు. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. తెలుగు సినిమాకు మూల స్థంభాలుగా ఉన్న అంద‌ర్నీ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇదే ఇప్పుడు అత్య‌ద్భుతంగా మార‌బోతుంది. సావిత్రి జీవితం అంటే అంద‌రితోనూ ముడిప‌డి ఉంటుంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. ఎస్వీఆర్.. నాగిరెడ్డి.. చ‌క్ర‌పాణి.. కేవీ రెడ్డి.. ఎంద‌రో మహనీయులు ఈ చిత్రంలో ఉన్నారు. వీళ్ల పాత్ర‌ల‌న్ని క‌ళ్లకు క‌ట్టిన‌ట్లుగా చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగేశ్వ‌ర‌రావ్ పాత్ర కోసం నాగ‌చైత‌న్య‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌ను మాత్రం డిజిట‌ల్ గా చూపిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ పాత్ర చేయ‌డానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ విముఖ‌త చూపించ‌డంతో డిజిట‌ల్ కు వెళ్లిపోయాడు అశ్విన్. 

ఇప్ప‌టికే ఇందులో ఎస్వీ రంగారావు పాత్ర‌లో మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌లైన క‌లెక్ష‌న్ కింగ్ ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేసింది. సావిత్రి జీవితాన్ని అత్యంత ద‌గ్గ‌ర్నుంచి చూసిన వాళ్ల‌లో ఎస్వీఆర్ కూడా ఒక‌రు. సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్ ఇప్ప‌టికే నాటి మ‌హాన‌టిని గుర్తు చేస్తుంది. జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా స‌మంత న‌టించింది.. ఇక సావిత్రి భ‌ర్త‌.. ఓ ర‌కంగా సావిత్రి జీవితానికి మ‌న‌కు తెలిసిన విల‌న్  జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించాడు. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు క్రిష్.. ఆయ‌న అసిస్టెంట్ సింగీతం శ్రీ‌నివాసరావ్ పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టిస్తున్నారు. సావిత్రి జీవితంలో మాయాబ‌జార్ సినిమా కీల‌కం. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి.. దానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సింగీతం. 

ఇక ఇదే సినిమాలో సావిత్రిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నాగిరెడ్డి.. చ‌క్ర‌పాణి ద్వ‌యం కూడా ఉన్నారు. వాళ్ల పాత్ర‌ల‌ను కూడా చ‌క్క‌గా తీర్చిదిద్ది తెర‌పై ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. వీళ్ళ‌తో పాటు మ‌న‌కు తెలియ‌ని సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర‌లో శాలిని పాండే.. జెమినీ గ‌ణేష‌న్ తొలి భార్య అలివేలు పాత్ర‌లో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మాళ‌విక న‌య్య‌ర్ న‌టించారు. సావిత్రి జీవితం ఎక్క‌డ మొద‌లై.. ఎలా ముగిసింది.. ఆమె జీవితంలో ఉన్న ప్ర‌తీ చిన్న‌ విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో.. చీక‌టి కోణాలు కూడా అన్నే ఉన్నాయి. చివ‌రి రోజుల్లో ఆమె తాగుడుకు బానిసై మ‌ర‌ణించింది. వాట‌న్నింటినీ సినిమాలో చూపిస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు.. అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా సావిత్రికి వివాదాలు వ‌చ్చాయి. వాటిని కూడా సినిమాలో చూపించాడా లేదా అనేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంకా ఒక్క రోజు ఆగితే చాలు.. మ‌హాన‌టి ఎలా ఉండ‌బోతుందో తెలిసిపోతుంది. మ‌రి ఈ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం ఏంటో చూద్దాం ఇక‌..!

More Related Stories