English   

టాక్సీవాలా రివ్యూ

Vijay Devarakonda’s Taxiwaala Review
2018-11-17 06:38:22

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటేనే ఏదో తెలియ‌ని ఆస‌క్తి.. అంచ‌నాలు ఉంటాయి. అయితే టాక్సీవాలాపై మాత్రం ముందు నుంచి ఎలాంటి ఆస‌క్తి లేదు. ఎందుకో తెలియ‌దు కానీ ఈ చిత్రాన్ని చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేసారు. ఇప్పుడు ఇదే అంచ‌నాల‌తో సినిమా వ‌చ్చింది. మ‌రి నిజంగానే అలాగే ఉందా.. లేదంటే ఆక‌ట్టుకుందా..?

క‌థ‌:
శివ‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తుంటాడు. ఏ జాబ్ దొర‌క్క‌పోవ‌డంతో ఓ ట్యాక్సీ తీసుకుని డ్రైవ‌ర్ గా సెటిల్ అయిపోతాడు. అదే ప్ర‌యాణంలోనే అను(ప్రియాంక‌) ప‌రిచ‌యం అవుతుంది. ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే కొన్ని రోజులు జ‌ర్నీ బాగానే ఉంటుంది కానీ అనుకోకుండా ఓ రోజు కార్ నుంచి వింత ప్ర‌వ‌ర్త‌న చూస్తాడు శివ‌. దాంతో భ‌య‌ప‌డి అమ్మేయాల‌నుకుంటాడు. ఆ త‌ర్వాత అదే కార్ కావాల‌ని ఓ డాక్ట‌ర్ ను చంపేస్తుంది. అందులో ఆత్మ ఉంద‌ని తెలుసుకుని.. ఆ త‌ర్వాత శివ ఏం చేసాడు..? అస‌లు దెయ్యం ఎవ‌రు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
కొన్నిసార్లు మ‌నం అనుకుంటున్నట్లు కాకుండా కొన్ని సినిమాల‌కు మ‌రో టాక్ వ‌స్తుంది. ఇప్పుడు టాక్సీవాలా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలాపై ముందు నుంచి కూడా ఎవ‌రికీ అంచ‌నాలు లేవు. దానికి తోడు వాయిదాలు ప‌డ‌టం.. పైర‌సీ రావ‌డం ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు త‌గ్గించేసాయి. అయితే ఇదే సినిమాకు ప్ల‌స్ అయింది ఇప్పుడు. ఎలాంటి అంచ‌నాలు లేవు కాబ‌ట్టే యావ‌రేజ్ గా ఉన్నా కూడా బాగుందంటున్నారు. నిజానికి క‌థ తెలిసిందే కానీ స్క్రీన్ ప్లే తెలివిగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు రాహుల్. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఫ‌స్టాఫ్ అంతా ఎంగేజింగ్ గా సాగిపోయింది. స‌ర‌దాగా వ‌చ్చే సీన్స్.. మ‌ధ్య‌లో హార్ర‌ర్ అలా సాఫీగా సాగిపోయింది. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ అంతా చాలా బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఆ త‌ర్వాత కార్ లో దెయ్యం ఉంద‌ని తెలిసిన త‌ర్వాత చెప్ప‌డానికి క‌థేం ఉండ‌దు.. కానీ దానికి మ‌ళ్లీ సైన్స్ ను ముడిపెట్టి కొత్త‌గా చూపించాడు రాహుల్. సెకండాఫ్ లో ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. స్లోగా నెరేష‌న్ ఉన్నా కూడా ఆస‌క్తిక‌ర‌మైన క‌థ కావ‌డంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. అక్క‌డ పోయిన ప్రాణం.. మ‌రో పాప‌లో రావ‌డం బాగుంది. ఎమోష‌న‌ల్ గా కంటెంట్ క్యారీ అవుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న మ‌రోసారి ప్ల‌స్ అయింది. ముఖ్యంగా కొత్త కుర్రాడు విష్ణు చేసిన హాలీవుడ్ పాత్ర బాగా పేలుతుంది. మ‌నోడు చాలా సీన్స్ లో న‌వ్వించాడు. క‌థ‌తో వ‌చ్చే కామెడీ సినిమాకు బ‌లం. ఓవ‌రాల్ గా అంచ‌నాలు లేకుండా వెళ్లిన వాళ్ల‌కు టాక్సీవాలా స‌ర్ ప్రైజింగ్ గిఫ్ట్. న‌య‌న‌తార డోరా ఛాయ‌లు క‌నిపించినా కూడా కొత్త‌గానే అనిపిస్తుంది.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి అలరించాడు. చాలా బాగా న‌టించాడు. అత‌డి కామెడీ టైమింగ్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక భ‌య‌ప‌డే సీన్స్ కూడా బాగా చేసాడు. హీరోయిన్ ప్రియాంక చాలా త‌క్కువ స్క్రీన్ స్పేస్ ఉంది కానీ బాగానే ఉంది.. అందంగానూ ఉంది. హీరో ఫ్రెండ్స్ పాత్ర‌ల్లో మ‌ధు, విష్ణు బాగా న‌టించారు. ముఖ్యంగా హాలీవుడ్ పాత్ర బాగా పేలింది. మాళ‌విక న‌య్య‌ర్ కీల‌క‌పాత్ర‌లో మెప్పించింది. సిజ్జు, య‌మున‌, క‌ళ్యాణీ అంతా ఉన్న మేర‌కు బాగానే న‌టించారు. ఛ‌మ్మ‌క్ చంద్ర రెండు సీన్ల‌లోనూ న‌వ్వించాడు.

టెక్నిక‌ల్ టీం:
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు ఆర్ఆర్ బ‌లంగా ఉండాలి. ఈ విష‌యంలో జేక్స్ బిజాయ్ స‌క్సెస్ అయ్యాడు. ఈయ‌న రీ రికార్డింగ్ బాగుంది. పాట‌లు కూడా ప‌ర్లేదు. ఎడిటింగ్ నీట్ గా ఉంది. చాలా సినిమా ముందే క‌ట్ చేయ‌డంతో పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. సినిమాటోగ్ర‌పీ కూడా ప‌ర్లేదు. ఇక క‌థ ప‌రంగా న‌య‌న‌తార డోరా గుర్తు చేసినా కూడా సైన్స్ ఫిక్ష‌న్ తో బాగానే క‌వ‌ర్ చేసాడు ద‌ర్శ‌కుడు రాహుల్. అదే సినిమాకు ప్ల‌స్ కూడా. పైగా అంచ‌నాలు లేకపోవ‌డంతో క‌లిసొచ్చింది. కామెడీ సినిమాకు బ‌లం. ఇదే కాపాడే వ‌రం కూడా. ఓవ‌రాల్ గా మంచి సినిమానే తీసుకొచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా: టాక్సీవాలా.. ఎంజాయ్ ది రైడ్.. వితౌట్ ఎక్స్ పెక్టేష‌న్స్..

రేటింగ్ 3/5

More Related Stories