English   

చిరు గుట్టు విప్పిన విజ‌య్..

Vijay-Sethupathi

అస‌లే ఇప్పుడు లీకేజ్ ల‌తో నిర్మాత‌ల ప్రాణాలు పోతున్నాయి. ద‌ర్శ‌కులు ఎలా దీన్ని కంట్రోల్ చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో సినిమాలో ఉన్న‌వాళ్లే త‌మ పాత్ర ఇది అంటూ ఓపెన్ అయిపోతే ఇంక అంత‌కంటే షాక్ ఇంకోటి ఉండ‌దు క‌దా..! ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి ఇదే చేసాడు. ఈయ‌న ప్ర‌స్తుతం సైరా సినిమాలో న‌టిస్తున్నాడు. త‌మిళ‌నాట స్టార్ హీరోగా ఉన్నా కూడా సైరాలో పాత్ర న‌చ్చి స‌పోర్టింగ్ యాక్ట‌ర్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌పెట్టాడు విజ‌య్. ఇప్ప‌టి వ‌ర‌కు సైరా సెట్ లో విజ‌య్ అడుగుపెట్ట‌లేదు. త్వ‌ర‌లోనే తాను ఈ షూటింగ్ లో జాయిన్ కానున్న‌ట్లు చెప్పాడు ఈ హీరో. ఈ మ‌ధ్యే జంగ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు విజ‌య్. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగానే మాట్లాడుతూ సైరాలో తాను తమిళ్ మాట్లాడే ఓ యోధుడి పాత్రలో న‌టించ‌బో తున్న‌ట్లు చెప్పాడు విజ‌య్ సేతుప‌తి.

ఈ పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని.. ఇది ఎప్పుడూ ఉయ్యాలవాడ‌తో పాటే ఉండే పాత్ర అని చెప్పాడు విజ‌య్. బ్రిటిష్ వారిని హ‌డ‌లెత్తించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.. అప్ప‌ట్లో తమిళ, తెలుగు వాళ్ల‌ను క‌ల‌ప‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని.. అలా చేసిన స‌మ‌యంలో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన త‌మిళ‌వాడిగా న‌టించ‌బోతున్నాన‌ని వివ‌రించాడు విజ‌య్ సేతుప‌తి. బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు రెండు ప్రాంతాలు రెండు భాషల్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ విధంగా ఒక్క తాటిపైకి తీసుకొచ్చాడనే దశలో తన పాత్ర పరిచయమవుతుందని చెప్పాడు ఈ హీరో. ఈ పాత్ర పేరు ఓబ‌య్య‌గా తెలుస్తుంది. ఈయ‌న ఉయ్యాల‌వాడ‌కు కుడిభుజంలా ఉన్నాడు. మ‌రి ఇప్పుడు ఈ పాత్ర‌లో విజ‌య్ ఎంత‌వ‌ర‌కు ఒదిగిపోతాడో చూడాలిక‌..!

More Related Stories