English   

విశ్వ‌రూపం 2 రివ్యూ

Vishwaroopam-2-Review
2018-08-10 13:30:02

విశ్వ‌రూపం.. ఈ సినిమా పేరు విన‌గానే ముందు గుర్తుకు వ‌చ్చేది క‌మ‌ల్ హాస‌న్. ఐదేళ్ల కింద విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యాల‌తో పాటు వివాదాలు కూడా సృష్టించింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు రెండో భాగం వ‌చ్చింది. మ‌రి ఇది ఎలా ఉంది..? అలాగే వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా ఉందా.. లేదంటే ఆక‌ట్టుకుంటుందా..?

క‌థ‌: ఆల్ ఖైదాతో క‌లిసి అక్క‌డి ప్లాన్స్ అన్నీ ఇండియ‌న్ ఆర్మీకి చెబుతుంటాడు ఇండియ‌న్ రా ఏజెంట్ వ‌జీమ్ కాష్మీరీ(క‌మ‌ల్ హాస‌న్). అక్క‌డి నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ ఇండియ‌న్ ఆర్మీలో చేర‌తాడు. ఇక్క‌డ్నుంచే తీవ్ర‌వాదంపై పోరాటం సాగిస్తుంటాడు. ఆల్ ఖైదాలో జ‌రిగిన దాడిలో మోస్ట్ వాంటెడ్ ఒమ‌ర్(అక్ష‌య్ ఖ‌న్నా) మాత్రం ఇంకా బ‌తికే ఉంటాడు. ఇప్ప‌టికి కూడా వ‌జీమ్ ను టార్గెట్ చేస్తుంటాడు. దాంతో త‌న భార్య నిరుప‌మ‌(పూజ‌కుమార్).. ట్రైనీ(ఆండ్రియా)తో క‌లిసి ఓమ‌ర్ వేట‌లో ఉంటాడు. అప్పుడు వ‌జీమ్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది..? అస‌లు ఒమ‌ర్ ను వ‌జీమ్ ప‌ట్టుకున్నాడా లేదా అనేది అస‌లు క‌థ‌.. 

క‌థనం:  విశ్వ‌రూపం పూర్తిగా ఆల్ ఖైదాపై ఇండియ‌న్ రా చేసే పోరాటం. ఇక్క‌డి ఏజెంట్ ను పాక్ కు పంపి.. అక్క‌డి వాళ్ల‌తో క‌లిసి వాళ్ల ప్లాన్స్ తెలుసుకుని ఇండియాకు అన్ని స‌మాచారాలు ఇస్తుంటాడు క‌మ‌ల్. ఆ త‌ర్వాత అస‌లు నిజం తెలిసి అత‌డిపై అటాక్ చేస్తారు. విశ్వ‌రూపం 2 ఎక్క‌డ్నుంచి మొద‌లు పెడ‌తాడో.. ఎక్క‌డికి వెళ్తుందో.. అస‌లు వాళ్లు లండ‌న్ ఎందుకు వ‌స్తారు.. అక్క‌డ నీళ్ల‌లో ఉన్న అనుఆయుధాల గురించి ఎందుకు ఆరా తీస్తారు.. ఇలా చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఉండ‌దు. మోస్ట్ వాటెండ్ టెర్ర‌రిస్ట్ అంత ఈజీగా జ‌నాల మ‌ధ్య‌లో తిరిగేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తుంటారు.. అత‌డు ఉన్న ప్లేస్ తెలిసిన త‌ర్వాత కూడా ఎందుకు ఒమ‌ర్ ను పోలీసులు ప‌ట్టుకోరు.. ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు విశ్వ‌రూపం 2లో ప్ర‌శ్న‌లు గానే మిగిలిపోయాయి. క‌థ విష‌యంలో ఎక్క‌డా మార్చ‌లేదు క‌మ‌ల్. ఫ‌స్ట్ పార్ట్ లో మిగిలిపోయిన‌.. లేదంటే ఎడిటింగ్ లేచిపోయిన సీన్స్ అన్నీ తీసుకొచ్చి ఒక‌ద‌గ్గ‌ర చేర్చి ఈ సినిమాలో చూపించాడేమో అనిపిస్తుంది. కొన‌సాగింపు క‌థ అంటే కంటిన్యూటి ఉండాలి క‌దా అలాంటి పొర‌పాటున కూడా విశ్వ‌రూపం 2లో క‌నిపించ‌దు. ఇంట‌ర్వెల్ బోర్డ్ వేసే వ‌ర‌కు అది బ్రేక్ అని తెలియ‌దు.. క్లైమాక్స్ అయిపోయింద‌ని చెప్పే వ‌ర‌కు సినిమా పూర్తైంది కూడా తెలియ‌దు.. అలా ఉన్న‌పుడు క‌థ‌లో ట్విస్టులు.. క‌థ‌నం గురించి చెప్ప‌డానికి ఏం ఉంటుంది..? అంతా క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప‌. రా ఏజెంట్స్ అంతా క‌లిసి టెర్ర‌రిస్ట్ ల‌పై అటాక్ చేయాలి.. కానీ ఇందులో అలాంటివేం క‌నిపించ‌వు. క‌థ‌పై అస్స‌లు క్లారిటీ లేకుండా ముందు ఈ సినిమాను ఎలాగోలా విడుద‌ల చేసేద్దాం అనే కంగారే క‌మ‌ల్ పై ఎక్కువ‌గా ప‌డిన‌ట్లుంది. ఓవ‌రాల్ గా విశ్వ‌రూపంను దృష్టిలో పెట్టుకుని వెళ్లిన‌వాళ్ల‌కు ఈ సినిమా చుక్క‌లే.

న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్ గురించి ఏం చెప్తాం.. ఆయ‌న న‌టుడిగా ఆకాశం. క‌థ ఎలా ఉన్నా ఆయ‌న మాత్రం అద్భుత‌మే. ఇందులోనూ అంతే. ఈ ఏజ్ లోనూ క‌మ‌ల్ చేసిన సాహసాలు సూప‌ర్. ఇక ఆండ్రియా బాగుంది.. యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా బాగా చేసింది. పూజ‌కుమార్ అందాల‌తో పాటు అవ‌స‌రం అనుకున్న‌పుడు న‌టించింది కూడా. శేఖ‌ర్ క‌పూర్ తో పాటు మిగిలిన వాళ్ళంతా అప్పుడ‌ప్పుడూ క‌థ‌లో ఉన్నాం అని గుర్తు చేస్తుంటారు. విల‌న్ గా తొలి భాగంలో చాలా సేపు ఉన్న అక్ష‌య్ ఖ‌న్నా.. ఈ సారి మాత్రం అతిథిగా మారిపోయాడు.

టెక్నిక‌ల్ టీం: జిబ్ర‌న్ సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. బేసిగ్గా క‌థ‌లో ఆక‌ట్టుకునే అంశాలే పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఆర్ఆర్ కు కూడా స్కోప్ లేకుండా పోయింది. ఇక ఎడిటింగ్ గురించి చెప్పుకోక‌పోతేనే మంచిది. క‌మ‌ల్ తో క‌లిసి చేసిన ఫ్రీజింగ్ ప్ర‌యోగాల‌న్నీ బెడిసి కొట్టాయి. అర్థం కూడా కాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. స్యామ్ ద‌త్ ప‌నితీరు బాగుంది. క‌మ‌ల్ క‌థ‌కుడిగా ఫెయిల్ అయ్యాడు. ద‌ర్శ‌కుడిగానూ షాక్ త‌ప్ప‌లేదు.
 
చివ‌ర‌గా:
విశ్వ‌రూపం 2.. బిల్డ‌ప్ ఎక్కువ‌.. బిజినెస్ త‌క్కువ‌..

రేటింగ్: 1.5/5

More Related Stories