English   

తప్పు దర్శకుల్లో ఉందా.. తెలుగు హీరోల్లో ఉందా..

VVR
2019-01-12 18:08:44

తెలుగు సినిమా మారుతుంది.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు కొత్త కథల వైపు పరుగులు తీస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్ని ప్రయోగాలు మరే ఇండస్ట్రీ కూడా చేయడం లేదు. మన హీరోలు కూడా కొత్త కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇదిగో ఇలాంటి కామెంట్స్ కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ మన హీరోలు మారలేదని.. దర్శకులు కూడా అలాగే ఉన్నారని ఇప్పుడు విడుదలైన రామ్ చరణ్ వినయ విధేయ రామ నిరూపించింది. ఓ సినిమాను ఎలా తీయకూడదు డిక్షనరీలా తీసి చూపించారు బోయపాటి శ్రీను. తనకు కొత్త సినిమాలు చేయడం రాదని.. కొత్త కథలతో ప్రయోగాలు చేయడం రాదని చెప్పే ఈ దర్శకుడు మరి ఇంత దారుణంగా సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

కథ లేకుండా సినిమాలు చేయడం ఎక్కడ నేర్చుకున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత ఈయన కూడా ఇంకా పూర్తిగా మారలేదని విషయం అర్థమైపోయింది. ధ్రువ, రంగస్థలం లాంటి సినిమాలు విజయాలు అందించిన కూడా మళ్లీ రొటీన్ కథల వైపు అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. దీన్ని బట్టి చూస్తుంటే మన హీరోలు ఇంకా మారలేదని.. ఇప్పటికీ రొటీన్ కథల వైపు అడుగులు వేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. కనీసం సినిమాలో కథ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా కేవలం స్టార్ డైరెక్టర్ అని ఒకే ఒక్క నమ్మకంతో సినిమాలు ఓకే చేసి నిర్మాతలను నిలువునా ముంచుతున్నారు స్టార్ హీరోలు. ఈ విషయంలో దర్శకులకు కూడా తప్పే ఉంది.. హీరోల చుట్టూ కథలు అల్లుకుంటూ ఎలాంటి సినిమాలు తీయాలో కూడా వాళ్లు మరిచిపోతున్నారు. ఓవైపు రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమాలు తీస్తుంటే బోయపాటి, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు ఇప్పటికీ అదే పాత రొడ్డకొట్టుడు కథలు రాసుకుంటూ అక్కడే ఉండి పోతున్నారు.

ఇప్పుడు విడుదలైన రామ్ చరణ్ బోయపాటి సినిమా కూడా దీనికి నిదర్శనం. స్టార్ డైరెక్టర్ అనే మోజులో హీరోలు కథలు వినకపోవడం ఎంత తప్పో.. స్టార్ హీరో దొరికాడు కదా అని కథను గాలికొదిలేయడం కూడా దర్శకులకు అంతే తప్పు. మరి దీని నుంచి ఎప్పటికీ గుణపాఠం నేర్చుకుంటారు చూడాలి.

More Related Stories