English   

దాస‌రి స్థానం మోహ‌న్ బాబుకేనా..?

mohan-babu

పెద్దాయ‌న.. ఇండ‌స్ట్రీ పెద్ద‌.. గురు.. ఇలా ఎన్ని పేర్ల‌తో పిలిచినా దాస‌రి నారాయ‌ణ‌రావుకు త‌క్కువే అవుతుందేమో..? ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలు.. వాళ్ల వార‌సులు.. ఇలా ఎన్నెన్నో జ‌రుగుతున్న క్ర‌మంలో కూడా ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న మాట‌తో నిల‌బెట్టిన మ‌హాధీరుడు దాస‌రి. ఆయ‌న పెద్ద‌రికానికి స్టార్ హీరోలు కూడా స‌లాం కొట్టేవాళ్లు. ఇండ‌స్ట్రీలో ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా కూడా దాస‌రి ఉన్నాడు క‌దా అనుకునేవాళ్లు. ఆయ‌న లేని లోటు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎంత‌లా అంటే ప్ర‌తీ ఒక్క‌రు దాస‌రి పోయిన‌పుడైనా బాధ ప‌డ్డారో లేదో తెలియ‌దు కానీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు జ‌రుగుతున్న సిచ్యువేష‌న్స్ చూసి అరెరే ఆయ‌న ఉండుంటే బాగున్నే అనుకుంటున్నారు. ఇప్పుడు అంద‌ర్లోనూ ఒకే ఆస‌క్తి క‌నిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో నెక్ట్స్ దాస‌రి ఎవ‌రు..? ఆయ‌న స్థానంలో ఎవ‌రు కూర్చుంటున్నారు అని..?
దాస‌రి స్థానంలో కూర్చోడానికి అన్ని విధాల అర్హుడు మోహ‌న్ బాబు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణాలు కూడా లేక‌పోలేవు. దాస‌రికి ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది శిష్యులు ఉన్నా కూడా మోహ‌న్ బాబు ప్ర‌త్యేకం. ఆయ‌నంటే దాస‌రికి కూడా చాలా అభిమానం. కొడుకుతో స‌మానంగా చూసుకునేవాడు. ఇక మోహ‌న్ బాబు కూడా ఏనాడూ దాస‌రి మాట‌కు ఎదురుచెప్ప‌లేదు. అలాంటి గురుశిష్యుల బంధం ఈ ఇద్ద‌రిది. పైగా మోహ‌న్ బాబు అంటే ఇండ‌స్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు గౌర‌వంతో కూడిన భ‌యం ఉంది. ఆయ‌న చెప్తే ఎదురుచెప్పే వాళ్లు కూడా లేరు. దాంతో ఇప్పుడు దాస‌రికి ఆయ‌నే స‌రైన వార‌సుడు అంటున్నారంతా. మోహ‌న్ బాబు అంటే స్టార్ హీరోల‌కు కూడా ఇష్ట‌మే. ఆయ‌న అంద‌రు హీరోల‌ను క‌లుపుకుని పోతుంటారు. చిరంజీవితో గిల్లిక‌జ్జాలు ఆడినా.. నాగ్ తో ప‌రాచ‌కాలు ఆడినా.. బాల‌య్య‌ను మొహం మీదే విమ‌ర్శించినా.. వెంక‌టేశ్ తో జోకులు వేసినా.. అన్నీ క‌లెక్ష‌న్ కింగ్ కే సాధ్యం. 

అంద‌రితోనూ ఆయ‌న‌కు ఉన్న బంధం అలాంటిది. దాంతో దాస‌రి స్థానంలోకి మోహ‌న్ బాబు వ‌స్తానంటే కాద‌నే వాళ్లు కూడా ఉండ‌రేమో..? అందుకే ఇప్పుడు ఆ పెద్దాయ‌న స్థానాన్ని మోహ‌న్ బాబు భ‌ర్తీ చేస్తే చూడాల‌ని చాలామంది కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానం ఛైర్మెన్ గా ఉన్నాడు. ముందు ఆ గుడి కంటే కూడా గుడిలాంటి ఫిల్మ్ ఛాంబ‌ర్ ను.. ఆ కంపౌండ్ ను.. అక్క‌డ త‌ప్పుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌ను బాగు చేయ‌డ‌మే మోహ‌న్ బాబు ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది. ఇదే చేస్తే త‌ల్లి లాంటి ఇండ‌స్ట్రీకి ఎంతోచేసిన వాడిగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు ఈ భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు. ఇదే జ‌ర‌గాల‌ని కూడా ఇండ‌స్ట్రీలో కోరుకుంటున్నారు ఆయన స‌న్నిహితులు. మ‌రి చూడాలిక‌.. గురువు ఆశీస్సుల‌తో ఇంత ఎదిగిన మోహ‌న్ బాబు.. గురువు వ‌దిలివెళ్లిన ఆశ‌యాన్ని కూడా అందుకుంటాడేమో..? 

More Related Stories