English   

రివ్యూ రైట‌ర్ల‌పై ఎందుకంత క‌క్ష‌..? 

tollywood
2018-07-02 09:51:11

రివ్యూ.. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పదం ఇది. ఈ ప‌దం ఒక్క సినిమాకు సంబంధించిందే కాదు.. అన్ని చోట్ల వాడుతుంటారు. రివ్యూ అనేది ఓ స‌మీక్ష‌. ఎలా ఉంది అని చెప్ప‌డానికి తెలిసిన మాట‌ల్లో కాస్త అందంగా కూర్చే ప్ర‌క్రియ‌. అక్క‌డెలా ఉంటే.. అద్దంలా ఇక్క‌డ కూడా అలాగే వ‌స్తుంది రివ్యూ. ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే రివ్యూవ‌ర్లపై ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు కామ‌న్ ప‌బ్లిక్ కూడా క‌త్తులు దూస్తున్నారు. ఇది నిజంగా శుభ‌ప‌రినామ‌మేనా..? అస‌లు ఓ సినిమా ఎలా ఉందో డిసైడ్ చేయాల్సింది ప్రేక్ష‌కులు. ఎవ‌రెన్ని మాట్లాడినా ఫైన‌ల్ గా సినిమా ప్రాణం తీసేదైనా.. నిల‌బెట్టేదైనా వాళ్లే. ఎవ‌రెన్ని చెప్పినా కూడా సినిమా బాగుంటే చూస్తారు లేదంటే వెళ్ల‌డం మానేస్తారు. మ‌రి అలాంటిది రివ్యూలు రాసినంత మాత్రాన‌.. రివ్యూ రైట‌ర్ల‌ను ఆపినంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోతాయా..? ఒక‌ప్పుడు రివ్యూ రైట‌ర్లు లేరు.. కానీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి క‌దా..? మ‌రి అప్పుడు ఎవ‌రు ఆపారు ప్రేక్ష‌కుల్ని..?

ఇప్పుడు హీరోల‌కు ఎందుకు ఇంత‌గా కోపం వ‌స్తుంది అనే విష‌యంపైనే ఇప్పుడు అంతటా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. ఆ మ‌ధ్య జై ల‌వ‌కుశ స‌క్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చాలా ఎమోష‌నల్ అయ్యాడు. ఇదే వేడుక‌లో చివ‌ర్లో రివ్యూ రైట‌ర్ల‌కు క్లాస్ గా క్లాస్ పీకాడు ఎన్టీఆర్. ఓ సినిమా విడుద‌ల అవుతుందంటే.. అది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న పేషెంట్ తో స‌మానం.. దాన్ని బ‌తికించే హ‌క్కు డాక్ట‌ర్లైన ప్రేక్ష‌కుల‌కు ఉంటుంది. అంతేకానీ మ‌ధ్య‌లో వ‌చ్చి వాడు పోతాడు పోతాడు.. క‌చ్చితంగా పోతాడు అని చెప్ప‌డానికి మీరెవ‌రు..? ఇలాగే ఇంకొంద‌రు హీరోలు కూడా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ కూడా రివ్యూ రైట‌ర్ల‌నే త‌ప్పుప‌ట్టాడు. 

ఎన్టీఆర్ తో పాటు ఆ మ‌ధ్య డిజే ప్ర‌మోష‌న్ లో బ‌న్నీ కూడా రివ్యూ రైట‌ర్ల‌పై ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు రివ్యూలనేవి ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు అవే ఇష్యూ అయిపోయింది. తొలిరోజు తొలి షోకే సినిమా ఇలా ఉంద‌ని అని చెప్పేస్తే ప్రేక్ష‌కుడు ఆ సినిమాను ఇంకేం ఎంజాయ్ చేస్తాడని అడుగు తున్నాడు బ‌న్నీ. ఎవ‌డో తెల్లోడు తీసిన అవేంజ‌ర్స్ సినిమా అద్భుతం అంటాడు గానీ మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చిన సినిమాల‌ను మాత్రం బాలేద‌ని చెప్తాడు రివ్యూ రైట‌ర్. అదే మ‌న ద‌గ్గ‌ర ఉన్న ద‌రిద్రం. మ‌న సినిమాను మ‌నం గౌర‌వించ‌కపోతే ఇంకెవ‌డు గౌర‌విస్తాడు అంటున్నాడు బ‌న్నీ. అల్లుఅర్జున్ మాట‌ల్లో అర్థం ఉంది కానీ ప్ర‌తీ సినిమాను అలా రాయ‌ట్లేదుగా..! అది కూడా అర్థం చేసుకోవాలి మ‌న హీరోలు. 

నిజంగానే బాగున్న సినిమా వ‌చ్చిన‌పుడు అంద‌రూ మూకుమ్మ‌డిగా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారుగా.. మ‌రి అప్పుడు మాట్లాడ‌రేంటి ఈ హీరోలు అని కొంద‌రు వాళ్ల‌పైనే రివ‌ర్స్ అటాక్ కూడా చేస్తున్నారు. రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. పెళ్లిచూపులు.. అర్జున్ రెడ్డి.. స‌మ్మోహ‌నం.. ఎక్క‌డో త‌మిళ్ నుంచి వ‌చ్చిన అభిమ‌న్యుడు.. ఇలా ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యేలా చేసింది రివ్యూ రైట‌ర్లే క‌దా..! మ‌రి అప్పుడెవ‌డూ నోరెత్త‌డే..! బాగోలేని సినిమా తీసి బాగుంద‌ని రాయ‌మంటే ఎలా..? అంటే మీకు మంచి రివ్యూ రాస్తే వాడు అన్నీ తెలిసిన రివ్యూ రైట‌ర్.. లేదంటే అర్హ‌త లేనివాడా..? ఇదెక్క‌డి న్యాయం..? 

More Related Stories