English   

వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ

Wife-Of-Ram
2018-07-20 10:29:47

వైఫ్ ఆఫ్ రామ్.. ఈ మ‌ధ్య కాలంలో డిఫెరెంట్ ప్ర‌మోష‌న్స్ తో బాగానే మంచు ల‌క్ష్మి పాపుల‌ర్ చేసిన సినిమా ఇది. ఆమె హీరోయిన్ గా వ‌చ్చిన ఈ చిత్రం ఇప్పుడు విడుద‌లైంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది..?

క‌థ‌: ల‌క్ష్మి(మంచు ల‌క్ష్మి) ఓ ఎన్జీఓ కంపెనీలో ప‌ని చేస్తుంటుంది. ఓ రోజు భ‌ర్త రామ్ (సామ్రాట్ రెడ్డి)తో క‌లిసి స‌ర‌దాగా అలా బ‌య‌టికి వెళ్తుంది. ఎవ‌రో ఓ వ్య‌క్తి వ‌చ్చి రామ్ ను చంపేసి.. అత‌డి భార్య‌ను గాయ‌ప‌రుస్తాడు. ఆ త‌ర్వాత పోలీసులు వ‌స్తారు.. హాస్పిట‌ల్ లో చేరుస్తారు. కానీ భ‌ర్త‌ను చంపిన వాళ్ల‌ను ప‌ట్టుకోమంటే మాత్రం సాయం చేయ‌రు. దాంతో రామ్ ను చంపింది ఎవ‌రో తెలుసుకోడానికి భార్య బ‌య‌ల్దేరుతుంది. ఆ క్ర‌మంలోనే పోలీస్ కానిస్టేబుల్ చారి(ప్రియ‌ద‌ర్శి) రామ్ భార్య‌కు సాయం చేస్తాడు. అప్పుడు ఏం జ‌రిగింది.. వాళ్లకు ఆ మ‌ర్డర్ చేసిన వాడు దొరికాడా లేదా అనేది క‌థ‌.. 

క‌థ‌నం: వైఫ్ ఆఫ్ రామ్ సింపుల్ గా చెప్పాలంటే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. భ‌ర్త‌ను చంపిన వాడి కోసం భార్య చేసే పోరాట‌మే ఈ చిత్రం. ఎవ‌రి సాయం లేకుండానే ఒంట‌రిగానే ఈ స‌మాజంలో అమ్మాయి చేసే పోరాటం ఈ చిత్ర క‌థ‌. మంచి క‌థే తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు విజ‌య్. అయితే న‌టీన‌టుల ఎంపిక‌లో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే బాగుండేది. మ‌రో ఆప్ష‌న్ లేక మంచు ల‌క్ష్మి ద‌గ్గ‌రికి వెళ్లాడో.. లేదంటే ఆమె కోస‌మే క‌థ రాసాడో తెలియ‌దు కానీ ఈ చిత్రానికి ల‌క్ష్మే మైన‌స్ అయిపోయింది. ఆమెను ఈ క‌థ‌లో ఊహించ‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ క‌థ బాగుంది.. మొద‌టి సీన్ నుంచే క‌థ‌లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ద‌ర్శ‌కుడు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంటే ఇన్వెస్టిగేష‌న్ ఎలా ఉంటుందో ప‌క్కాగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. బాలీవుడ్లో విద్యాబాల‌న్ న‌టించిన క‌హానీ గుర్తులు ఇందులో క‌నిపిస్తాయి. చాలా సీన్స్ లో క‌హానీ మ‌న‌కు తెలియ‌కుండానే గుర్తొస్తుంది. అక్క‌డా ఇక్క‌డా సీన్స్ కూడా కొన్ని మ్యాచ్ అవుతుంటాయి. అయితే చివ‌ర్లో ఇచ్చిన ట్విస్ట్ తో రెండు క‌థ‌లు ఒక‌టి కాద‌ని తేలిపోతాయి. కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డంతో స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఫ‌స్టాఫ్ అంతా సోసోగా అనిపించినా.. సెకండాఫ్ లో క‌థ బాగానే ప‌రుగులు పెడుతుంది. అయితే ప్ర‌తీసారి మంచు ల‌క్ష్మి కాకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ ఒక్క పాయింట్ ఈ చిత్రానికి అతిపెద్ద మైన‌స్. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ తో పాటు సందేశాన్ని కూడా ఇచ్చి సినిమాను పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు: మంచు ల‌క్ష్మిని న‌టిగా నిరూపించుకోవాల‌ని కోరిక చాలా ఉంద‌ని ఈ చిత్రంతో అర్థ‌మైపోతుంది. కానీ త‌న‌కు ఎలాంటి పాత్ర‌లు సూట్ అవుతాయో కూడా చూసుకోవాలి. బాగా న‌టించింది అనిపించినా కూడా ఇలాంటి పాత్ర‌ల్లో ఆమెను ఊహించ‌డం కాస్త క‌ష్ట‌మే. పోలీస్ కానిస్టేబుల్ గా ప్రియ‌ద‌ర్శి మంచి పాత్ర‌లో న‌టించాడు. రౌడీ ఎస్సైగా శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ బాగానే చేసాడు. సామ్రాట్ రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్ ఉన్నంత వ‌ర‌కు ఓకే. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం: పాట‌లు లేని ఈ చిత్రానికి ర‌ఘు దీక్షిత్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ప‌ని చేసింది. కొన్ని సీన్స్ లో మంచి స్కోర్ ఇచ్చాడు ఈయ‌న‌. త‌క్కువ నిడివి ఉంది కాబ‌ట్టి ఎడిటింగ్ లో కూడా పెద్ద‌గా స‌మ‌స్య‌లేం లేవు. అయితే ఫ‌స్టాఫ్ లో మాత్రం అక్క‌డ‌క్క‌డా కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క‌థ విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు విజ‌య్ తో పాటు సందీప్ గంటాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. స‌మాజంలో జ‌రుగుతున్న కాన్ టెంప‌ర‌రీ ఇష్యూను తీసుకుని క‌థ సిద్ధం చేసుకున్నారు. ద‌ర్శ‌కుడి విష‌యానికి వ‌స్తే తొలి సినిమా స‌మ‌యంలో చేసే కొన్ని లోపాలు క‌నిపించాయి. అందులో క్యాస్టింగ్ కూడా ఒక‌టి. 

చివ‌ర‌గా: వైఫ్ ఆఫ్ రామ్.. ఆప‌రేష‌న్ స‌క్సెస్.. పేషెంట్ డెడ్.. 

రేటింగ్: 2.5/5.

More Related Stories