మగధీరను మళ్లీ చూస్తారా..?

పదేళ్లైంది.. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ల టైమ్ కూడా కాదు.. సినిమా వచ్చిన నెల రోజుల్లోనే అమేజాన్ అని అదనీ ఇదనీ ఒరిజినల్ ప్రింట్లు బయటికి వచ్చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో పదేళ్ల తర్వాత మళ్లీ మగధీరను విడుదల చేస్తే చూస్తారా..? అదే విచిత్రం జరగబోతుంది. ఆగస్ట్ 31న మగధీర మళ్లీ వస్తున్నాడు. అయితే మన దేశంలో మాత్రం కాదు. జపాన్ లో ఇప్పుడు చరణ్ దండయాత్ర చేయబోతున్నాడు. 2009లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రాజమౌళి రేంజ్ ఓ పాటు తెలుగు సినిమా స్థాయేంటని బాలీవుడ్ కు కూడా చూపించింది. రాజమౌళి పుణ్యమా అని ఇప్పుడు ఈ చిత్రం జపాన్ లో మరోసారి విడుదలవుతుంది.
బాహుబలి 2 అక్కడ అద్భుతమైన విజయం సాధించింది. దాంతో రాజ మౌళి బ్రాండ్ కు బాగానే కనెక్ట్ అయిపోయారు జపనీయులు. దాంతో ఈయన గత సినిమాలను అక్కడ విడుదల చేయాలని చూస్తున్నారు. జక్కన సినిమాల్లో అలా విడుదల చేయగలిగే సత్తా ఉన్న సినిమా మగధీర మాత్రమే. మిగిలినవన్నీ పక్కా మాస్ సినిమాలే. మగధీరలో యుద్ధాలున్నాయి రాజ్యం కోసం పోరాటం ఉంది.. ప్రేమ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మగధీరను ఎంచుకున్నారు. ఆగస్ట్ 31న విడుదల కానుంది ఈ జపాన్ మగధీర. ఇప్పటికే అక్కడ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసారు దర్శక నిర్మాతలు. అయినా మగధీర వచ్చి పదేళ్లైంది అని మనకు తెలుసు కానీ జపాన్ లో ఎలా తెలుసు..? అందుకే పాపం కొత్త సినిమా అనుకుని చూసినా చూసేస్తారు.