English   

యాత్ర మూవీ రివ్యూ !

Yatra
2019-02-08 06:42:43

యాత్ర సినిమా పై కొన్ని రోజులుగా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒక్కొక్క విజువల్ విడుదలవుతుంటే సినిమాపై అంచనాలు కూడా పెరిగి పోయాయి. ఇప్పుడు ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుందో చూద్దాం.

కథ:

వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ లోనే కాదు తెలుగు రాష్ట్రంలో కూడా అతి పెద్ద రాజకీయ నాయకుడు ప్రజా బలం మెండుగా ఉన్న మహానాయకుడు. అయితే ప్రతిపక్షంలో ఉండటంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆయన కోరిక తీరదు, దానికి తోడు ఎన్నికలు కూడా ముందస్తుగా రావడంతో అప్పటికప్పుడు పాదయాత్రకు పూనుకుంటాడు రాజశేఖర్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

కథనం:

రాజశేఖర్ రెడ్డి జీవితం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. తెలుగు ప్రజలందరికీ ఒక మహా నాయకుడిగా ఆయన తెలుసు. ఆయన చేసిన ప్రజా సంక్షేమం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ జనాల్లో ఉన్నాయి. అందుకే ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ రాజన్న రాజన్న అంటూ ఆయనే తలచుకుంటున్నారు. ఇక ఇప్పుడు యాత్ర సినిమాలో కూడా దర్శకుడు మహి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా అడుగులు వేశారు అనేది ఈ చిత్రంలో చూపించారు. పాదయాత్ర చేయడానికి గల ముఖ్య కారణాలు అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండేవాడు అనేది కూడా పూసగుచ్చినట్టు చూపించాడు. ఒక మాట ఇస్తే దాని కోసం ఎంత దూరమైనా వెళ్లే మహా నాయకుడిగా మడమతిప్పని నేతగా వైయస్ పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు మహి వి రాఘవ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పాదయాత్రకు సిద్ధం కావడం, మొదలుపెట్టిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో నింపేసాడు ముఖ్యంగా హాస్పిటల్స్ లో మనసును హత్తుకుంటాయి. దానికి తోడు ప్రజా సంక్షేమ పథకాలు ఆయన బుర్రలో ఎలా వచ్చాయో ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా భజన మరీ ఎక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్లు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు కూడా పడ్డాయి అనుకోండి అది వేరే విషయం. మొత్తంగా వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ఎమోషనల్ డ్రామా నిలిచిపోయింది. 

నటీనటులు:

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నంత స్థాయిలో నటించాడు. ఆయన నటన సినిమాకు ప్రాణం రాజశేఖర్ రెడ్డిని అచ్చంగా స్క్రీన్ పై దించేశాడు. సుహాసిని చేవెల్ల చెల్లెమ్మ సబితా ఇంద్రరెడ్డి పాత్రలో బాగా సరిపోయింది. అనసూయ గౌరు చరితారెడ్డి పాత్రలో నటించింది. వైయస్సార్ ఆత్మ కేవీపీ పాత్రలో రావు రమేష్ ఒదిగిపోయాడు. మిగిలిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

సాంకేతిక నిపుణులు:

యాత్ర సినిమాకు సంగీతం ప్రాణంగా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణ కుమార్ అద్భుతమైన పాటలు అందించాడు. దాంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా అనిపించాయి. ఎడిటింగ్ నీట్ గా అనిపించింది ఎక్కడ బోర్ కొట్టించే సీన్స్ లేవు. ఇక దర్శకుడిగా మహి వి రాఘవ్ ఆ అద్భుతమైన పనితీరు కనిపించింది. చక్కటి ఎమోషనల్ డ్రామా గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

చివరగా: ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైఎస్ఆర్

రేటింగ్: 2.75/5

More Related Stories