English   

థియేట‌ర్స్ కు ఏంటి ఈ ఖ‌ర్మ‌..? 

vijay-devarakonda-theaters
2018-03-10 13:16:30

మొన్న‌టివ‌ర‌కు సినిమాలు చూద్దాం అంటే థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఇప్పుడు అన్నీ స‌మ‌సిపోయి హాల్స్ తెరిచారు. కానీ ఈగ‌లు తోలుకోవ‌డం  ఏం చేయ‌లేక‌పోతున్నారు. దానికి కార‌ణం థియేట‌ర్స్ ఓపెన్ అయినా అందులో న‌డిపించ‌డానికి కొత్త సినిమాలు లేవు. వ‌చ్చిన సినిమాలు ఏవీ బాగోలేవు. క‌నీసం వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. మార్చ్ 2 నుంచి 9 వ‌ర‌కు థియేట‌ర్స్ క్లోజ్.. 9న ఓపెన్ అయినా ఆ రోజు వ‌చ్చిన ఏం మంత్రం చేసావే పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. మ‌న ద‌గ్గ‌ర ప‌రిస్థితి ఇలా ఉంటే చెన్నైలో మ‌రీ దారుణంగా ఉంది. అక్క‌డ ఏకంగా పాత సినిమాల‌నే మ‌ళ్లీ విడుద‌ల చేసారు. క‌బాలి.. తెరీ.. మెర్స‌ల్ సినిమాలు అక్క‌డ థియేట‌ర్స్ రీ రిలీజ్ అయ్యాయి. 

ఇక్క‌డ కూడా ఏదో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ వాడుకోవాలని నాలుగేళ్ల కింది సినిమా విడుద‌ల చేసినా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు. దానికితోడు మంచి టాక్ వ‌స్తే కానీ ఇప్పుడు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు క‌ద‌ల‌డం లేదు. 2018లో ఇప్ప‌టి వ‌ర‌కు జై సింహా.. భాగ‌మ‌తి.. ఛ‌లో.. తొలిప్రేమ ఓకే అనిపించినా మిగిలిన సినిమాల‌న్నీ బాల్చీ తన్నేసాయి. దాంతో ఇండ‌స్ట్రీకి ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా క‌లిసొచ్చిందేమీ లేదు. దాంతో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ కోస‌మే కాదు.. థియేట‌ర్స్ క‌ళ‌క‌ళ‌లాడే సినిమా కోసం కూడా వేచి చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా ప్రేక్ష‌కులు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ ఒక్క వారం ఆగితే మార్చ్ 16 నుంచి ఇదే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు సినిమా ప్రేమికులు. 

ఎగ్జామ్ టైమ్ కావ‌డంతో పెద్ద హీరోలెవ‌రూ ఈ టైమ్ లో త‌మ సినిమాలు విడుద‌ల చేయ‌డానికి ఆస‌క్తి చూపించరు. దాంతో మార్చ్ 16న కిరాక్ పార్టీ వ‌చ్చే వ‌ర‌కు థియేట‌ర్స్ ఇలాగే ఖాళీగా ఉండ‌క త‌ప్ప‌దు. అప్ప‌ట్నుంచీ వారానికో పెద్ద సినిమా రానుంది. మార్చ్ 23న ఎమ్మెల్యే.. 30న రంగ‌స్థ‌లం.. ఎప్రిల్ 5న ఛ‌ల్ మోహ‌న్ రంగా.. 12న కృష్ణార్జున యుద్ధం.. 20న భ‌ర‌త్ అనే నేను.. 27న కాలా.. మే 4న నా పేరు సూర్య నా యిల్లు ఇండియా.. ఇలా సాగనుంది సినిమాల జాత‌ర‌. అంటే మ‌రో వారం థియేట‌ర్స్ ఇలాగే ఖాళీగా ఉండ‌క త‌ప్ప‌దు. ఆ త‌ర్వాతే మ‌ళ్లీ థియేట‌ర్స్ క‌ళ‌క‌ళ‌లాడిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు ఈగ‌లు తోలుకోవాల్సిందే..!

More Related Stories